22-05-2025 08:07:03 PM
రంగంలోకి ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Department of Meteorology) హెచ్చరికతో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో వడ్లు తడవకుండా చర్యలు చేపట్టాలని, కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్ విభాగాలు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్‌ను ఆదేశించారు.
అలాగే, ప్రభుత్వం 12 ఎస్‌డీఆర్ఎఫ్ టీమ్స్‌ను సిద్ధంగా ఉంచింది. ఒక్కో టీమ్‌లో 100 మంది స్టేట్ స్పెషల్ పోలీస్(State Special Police) విభాగానికి చెందిన వారు ఉన్నారు. ఈ బృందాలను రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అందుబాటులో ఉంచామని డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం(Disaster Management Department) పేర్కొంది. ఎక్కడైనా భారీ వర్షాలు వస్తే సమీపంలోని ఎస్డీఆర్ఎఫ్బృందాలు అక్కడికి చేరుకోని రక్షణ చర్యలు చేపడతారని వెల్లడించింది. మరోవైపు హైదరాబాద్‌లో ఎస్‌డీఆర్ఎఫ్ టీమ్స్‌తో పాటు, మూడు ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కలెక్టర్లు తమ జిల్లా పరిధిలోని ఫైర్ ఆఫీసర్లను సంప్రదించి ఎస్‌డీఆర్ఎఫ్ సేవలు పొందాలని కాంగ్రెస్ ప్రభుత్వం సూచించింది.