06-08-2024 12:00:00 AM
యామినీ కృష్ణమూర్తి :
భరతనాట్యానికి పర్యాయపదం ఆమె. కూచిపూడి, ఒడిస్సీ నృత్యాల్లోనూ నిష్ణాతురాలు. దేశీయ నృత్యాన్ని అంతర్జాతీయ వేదికల్లో పరిచయం చేసిన మహోన్నత కళాకారిణి. సంగీతమూ నేర్చిన ఆమె పాట పాడుతూ నాట్యం చేయడంలో దిట్ట. బహుముఖీన ప్రతిభకు నిలువెత్తు రూపమైన ఆమె ఎవరో కాదు, భారతీయ నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి. అవివాహితగా తన జీవితాన్ని నాట్యరంగానికే అంకితం చేసిన ఆమె ‘ఇక లేరు’ అంటే ఎవరూ నమ్మలేకపోయారు.
ఎనభై నాలుగేండ్ల యామినీ వయో సంబంధ అనారోగ్యాల బారినపడి గతవారం రోజులుగా చికిత్స పొందుతూ ఇటీ వల తుదిశ్వాస విడిచారు. భారత కళారంగానికి ఆమె మరణం తీరని లోటు. 20 డిసెంబర్ 1940న చిత్తూరు జిల్లా మదనపల్లిలో జన్మించిన యామినీ తండ్రి కృష్ణ మూర్తి సంస్కృత పండితులు, తాత ఉర్దూ కవి. ఆమె పూర్తి పేరు యామినీ పూర్ణ తిలకం.
5వ ఏటినుంచే తండ్రి ప్రోత్సాహంతో భరతనాట్యం నేర్చుకున్నారు. ఎల్లప్ప పిళ్ళై, దండాయుధ పాణి, గౌరి అమ్మ వంటి గురువులవద్ద శిక్షణ తీసుకున్నారు. వేదాంతం లక్ష్మీనారాయణశాస్త్రి, చింతా కృష్ణమూర్తి, పసుమర్తి వేణుగోపాల కృష్ణశర్మ వంటి దిగ్గజాలవద్ద కూచి పూడిలో మెళకువలు నేర్చారు.
పంకజ్ చరణ్‌దాస్, కేలూచరణ్ గురువులవద్ద ఒడిస్సీ నృత్యం అభ్యసించారు. రామనాథన్ దగ్గర కర్ణాటక, స్వామినాథన్‌వద్ద వీణలో శిక్షణ పొందారు. తమిళనాడులోని చిదంబరంలో స్థిరపడిన యామినీ భరతనాట్యంతోపాటు కూచిపూడిలోనూ ప్రావీణ్యం పొందారు. 17వ ఏట 1957లో తొలి నృత్య ప్రదర్శన ఇచ్చారు.
20 సంవత్సరాల వయసు వచ్చే వరకే ప్రఖ్యాత నాట్య కళాకారిణిగా గుర్తింపు పొంది, తన మకాంను ఢిల్లీకి మార్చారు. ప్రపంచ దేశాలకు భారతీయ నృత్య కళలను ఎంతో గొప్పగా పరిచయం చేసిన యామినీ చిరస్మరణీయురాలు. దేశ విదేశాల్లో వేల ప్రద ర్శనలు ఇచ్చారు యామినీ. భారతీయ నాట్యరంగానికి ఎనలేని సేవలు అందించారు.
ఆమె తనదైన ఒరవడిని, విశిష్ట బాణీని తన కాలి అందెలద్వారా కళాభిమానుల ప్రేమను చూరగొన్నారు. ఢిల్లీలో ‘యామినీ స్కూల్ ఆఫ్ డ్యాన్స్’ పేరుతో సంస్థను స్థాపించారు. యువతకు భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో శిక్షణ ప్రారంభించారు. టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ‘ఆస్థాన నర్తకి’గా కళాసేవ ను కొనసాగించారు.
‘క్షీర సాగర మథనం’ నృత్య నాటికలో ‘విశ్వమోహిని’ పాత్రకు ప్రాణం పోశారు. ఈ నృత్యాన్ని నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎదుట ప్రదర్శించి ‘భామావేణి’ బిరుదును పొందారు. ‘భామాకలాపం’లో సత్యభామగా అద్వితీయ ప్రతిభను ప్రదర్శించారు.
1968లో పద్మశ్రీ, 1977లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 2001లో పద్మభూషన్, 2016లో పద్మ విభూషన్ సహా అనేక అవార్డులు పొందారు. ఉత్పలేందు చక్రవర్తి దర్శకత్వంలో ‘చందనీర్’ అనే బెంగాలీ సినిమాలో తన పాత్రలో తానే నటించి ప్రేక్షకలను మెప్పించగలిగారు. బహుముఖీన నృత్య, సంగీత ప్రతిభ కలిగిన యామినీ కళా జీవితం నేటి యువ కళాకారులకు ఆదర్శప్రాయం.
డా.బుర్ర మధుసూదన్ రెడ్డి