06-08-2024 12:00:00 AM
బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొద్ది నెలల క్రితం శాంతియుతంగా మొదలైన ఆందోళనలు ఊహించని పరిణామాలకు సృష్టించాయి. దేశవ్యాప్త ఆందోళనలు తీవ్ర హింసకు దారితీయడంతో షేక్ హసీనా సర్కార్ వణికి పోయింది. వందలాదిమంది ప్రాణాలు కోల్పోవడంతో చివరికి ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం వీడాల్సి వచ్చింది.
ప్రత్యేక ఆర్మీ విమానంలో భారత్‌కు చేరుకున్న హసీనా ఆ వెంటనే బ్రిటన్ వెళ్లి ఆశ్రయం పొంది వుండవచ్చని తెలుస్తున్నది. సోమవారం రాత్రి హిండన్ ఎయిర్ బేస్‌కు చేరుకున్న ఆమె అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. బంగ్లాదేశ్‌లో పరిణామాల నేపథ్యంలో ఆ దేశంతో సరిహద్దులను కాపలా కాస్తున్న బీఎస్‌ఎఫ్ అప్రమత్తమైంది.
4 వేల కి.మీ. పొడవైన భారత్- బంగ్లాదేశ్‌ల సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించింది. ఆ దేశానికి రైలు, విమాన సర్వీసులు నిలిచి పోయా యి. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటంలో పోరాడిన వారి కుటుంబసభ్యులకు ప్రభుత్వోద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ హసీనా ప్రభుత్వం కొద్ది నెలల క్రితం తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది.
ఇది వివక్షాపూరితమని, హసీనా నేతృత్వంలోని అధికార అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులకే ప్రయోజనం చేకూరుస్తుందనే వాదన మొదలైంది. దీంతో ఈ రిజర్వేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనబాట పట్టారు. ఆందోళనలు దేశవ్యాప్తం కావడం చివరికి వందలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి దారి తీసింది.
ఈ క్రమంలో ప్రభు త్వం కల్పించిన 30 శాతం రిజర్వేషన్లను 5 శాతానికి కుదిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కోర్టు ఆదేశాలను హసీనా ప్రభుత్వమూ అంగీకరించింది. దీంతో పరిస్థితులు సద్దుమణుగుతాయని అందరూ భావించారు. అయితే, ఆందోళనకారులు మాత్రం వెనక్కి తగ్గలేదు. గత కొద్ది రోజలుగా ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.
ఆందోళనకారు లు, ప్రభుత్వం, పోటీ ఉద్యమకారుల మధ్య ఘర్షణల్లో మొత్తం 300 మంది చనిపోయారు. ఆందోళనలను అణచి వేసేందుకు హసీనా ప్రభు త్వం ఇంటర్నెట్, మొబైల్ సేవలపై నిషేధం విధించింది. ఉద్యమకారులతో చర్చలు జరిపేందుకు పిలుపునిచ్చినా వారు అందుకు అంగీకరించలేదు.
దీంతో దేశవ్యాప్తంగా కర్ఫ్యూనూ విధించింది. కానీ, సోమవారం లక్షలాది మంది ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి ప్రధాని కర్ఫ్యూ ఆంక్షలను ఉల్లంఘించి, బారికేడ్లు ధ్వంసం చేసి ప్రధాని అధికార నివాసాన్ని ముట్టడించారు. ఆ సమయానికే హసీనా ప్రత్యేక ఆర్మీ విమానంలో దేశాన్ని వది లిపెట్టి పారిపోయారు. ఈ విషయం తెలిసిన ఆందోళనకారులు ఆమె నివాసంలోకి చొరబడి విధ్వంసం సృష్టించారు.
చేపలు, కూరగాయలు, ఫర్నీ చర్, ఇతర విలువైన వస్తువులు ఇలా చేతికి ఏది దొరితే అది పట్టుకెళ్లినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన ప్రధాని నిష్క్రమణతో పలువురు వీధుల్లోకి వచ్చి జెండాలు ఊపుతూ సంతోషం వ్యక్తం చేశారు. ఆర్మీ ట్యాంకులు ఎక్కి డ్యాన్సులు చేశారు.
హసీనా రాజీనామాతో సైన్యం రంగంలోకి దిగింది. దేశం మొత్తం దాని నియంత్రణలోకి వచ్చింది. ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్- దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నిరసనకారులు హింసామార్గాన్ని వీడాలని పిలుపునిచ్చారు.
అంతకు ముందే ఆర్మీ ఆందోళనకారులకు మద్దతు తెలపడమే కాకుండా పదవికి రాజీనామా చేయడానికి హసీనాకు 45 నిమిషాల సమయం ఇస్తూ అల్టిమేటం జారీ చేసినట్లు వార్తలు వ్చాయి. ప్రభుత్వం తీసుకున్న ఓ అనాలోచిత నిర్ణయం 15 ఏళ్లపాటు సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన ఓ ప్రధాని గద్దె దిగడానికి కారణమైంది. ‘బంగబంధు’గా దేశ ప్రజలు కీర్తించే ముజిబుర్ రెహమాన్ కుమార్తె ఇలా అవమానకర రీతిలో దేశాన్ని వీడి పారిపోవలసి వచ్చింది.