calender_icon.png 12 September, 2024 | 11:37 PM

ధరణి నుంచి క్వాంటెల ఔట్!

04-07-2024 01:15:58 AM

అక్టోబర్‌లో ముగియనున్న కాంట్రాక్టు

నవంబర్ నుంచి ప్రభుత్వ ఆధీనంలోకి ధరణి

ఎన్‌ఐసీ, సీజీజీ, టీఎస్‌ఆన్‌లైన్‌లలో ఏదో ఒక సంస్థకు ధరణి బాధ్యతలు

దాదాపుగా పూర్తయిన కసరత్తు 

త్వరలోనే అధికారికంగా వెల్లడి 

హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 3 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో భూ రికార్డుల నిర్వహణ త్వరలోనే ప్రభుత్వ ఆధీనంలోకి రానుంది. ‘ధరణి’ నిర్వహణ బాధ్యతల నుంచి టెర్రాసిస్ అలియాస్ ‘క్వాంటెల’ సంస్థను తప్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. 2024 అక్టోబర్‌లో క్వాంటెల సంస్థ కాంట్రాక్టు గడువు ముగియనుంది.

గడువు ముగిసిన వెంటనే ఆ సంస్థను ధరణి నిర్వ హణ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పించి ప్రభుత్వ ఆధీనంలోని ఎన్‌ఐసీ (నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్), సీజీజీ (సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్), టీజీ ఆన్‌లైన్ (తెలంగాణ ఆన్‌లైన్ సర్వీసెస్) సంస్థల్లో ఏదైనా ఒకదానికి ధరణి సాఫ్ట్‌వేర్/ నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత తెలంగాణలో భూ రికార్డుల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం రాష్ట్రంలో ధరణి కారణంగా రైతులు పడుతున్న ఇబ్బందులకు, భూ సమస్యలన్నింటికి పోర్టల్ సాఫ్ట్‌వేర్‌ను లోపభూయిష్టంగా రూపొందించడమే కారణమని ప్రభుత్వం భావిస్తున్నది. అలాగే అత్యంత విలువైన భూ రికార్డుల నిర్వహణ ప్రైవేటు సంస్థల వద్ద ఉండటం శ్రేయస్కరం కాదని ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ క్రమంలోనే టెర్రాసిస్ అలియాస్ క్వాంటెల సంస్థ కాంట్రాక్టును మళ్లీ పునరుద్ధరించవద్దని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 

సంస్థ ఒకటే.. వేశాలు మూడు

2018లో తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన భూ సంస్కరణల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో భూ రికార్డులను డిజిటలైజ్ చేయాలని నాటి కేసీఆర్ ప్రభు త్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ధరణి వెబ్‌పోర్టల్‌ను రూపొందించి ధరణి పేరుతో రైతులందరికి పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేసింది. అయితే ఈ ధరణి వెబ్‌పోర్టల్‌ను మొదటగా ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ అనే ఓ సంస్థ రూపొందించి డిజిటల్ భూ రికార్డులను నిర్వహించింది. ప్రారంభానికి ముందే ఈ సాఫ్ట్‌వేర్‌లో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తటంతో అధికారుల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యవహారంలో అప్పట్లో ఓ ఐఏఎస్ అధికారి పాత్ర అత్యంత చర్చనీయాంశంగా మారింది.

దీంతో కేసీఆర్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కానీ ఒకరిద్దరు ఐఏఎస్ అధికారుల కనుసన్నల్లోని ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ సంస్థ టెర్రాసిఐఎస్ పేరుతో మళ్లీ రంగంలోకి దిగి ధరణి నిర్వహణ బాధ్యతలను చేజారకుండా చూసుకుంది. దాదాపు రెండు సంవత్సరాల కసరత్తు పూర్తయిన తర్వాత 2020 అక్టోబర్ 29వ తేదీన ధరణి పోర్టల్ అధికారికంగా అమల్లోకి వచ్చింది. కొద్ది రోజులు గడిచిన తర్వాత టెర్రాసి సంస్థ తీరుపై కూడా అనేక అరోపణలు రావడంతో మళ్లీ పేరు మార్చుకొని క్వాంటెలగా రంగంలోకి దిగి ధరణిని నిర్వహిస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు ఈ సంస్థల వివరాలపై అత్యంత గోప్యత పాటించారు.  

తెలంగాణ మినహా దేశమంతటా ఎన్‌ఐసీ చేతుల్లోనే

తెలంగాణ రాష్ట్రంలో మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ భూ పరిపాలన, రికార్డుల నిర్వహణ వెబ్‌సైట్లను, పోర్టల్లకు ఎన్‌ఐసీ సంస్థనే సాఫ్ట్‌వేర్ రూపకల్పన చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఎన్‌ఐసీ అత్యంత పారదర్శకంగా సాఫ్ట్‌వేర్‌ను రూపకల్పన చేయడంతో పాటు సమర్థవంతంగా నిర్వహిస్తుంది. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఎన్‌ఐసీని కాదని ఓ అనామక ప్రైవేటు సంస్థ అయిన ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ సంస్థకు అప్పగించింది.

ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ప్రభుత్వ, పట్టా భూములకు సంబంధించిన యాజమాన్య హక్కులు ఉండటం అత్యంత ప్రమాదకరమని నిపుణులు మొదటి నుంచి హెచ్చరించారు. వారి హెచ్చరికలను కేసీఆర్ ప్రభుత్వం ఖాతర్ చేయలేదు. తాజాగా భూ యాజమాన్య రికార్డుల బాధ్యతను ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించడంతో పాటు క్వాంటెల సంస్థను ధరణి నుంచి 2024 అక్టోబర్ తర్వాత శాశ్వతంగా విముక్తం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.