06-11-2025 02:09:01 AM
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ
కొనుగోళ్ల నిలిపివేతను విరమించిన జిన్నింగు మిల్లు యజమానులు
మహబూబాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనలను కఠిన తరం చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా జిన్నింగు మిల్లు యజ మానులు గురువారం నుంచి పత్తి కొనుగోళ్లు నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. స్పందించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిన్నింగు మిల్లుల యజమానులతో చర్చలు జరిపారు. జిన్నింగ్ మిల్లులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హమీ ఇచ్చారు. మంత్రి ఇచ్చిన హామీతో పత్తి రైతులకు ఇబ్బంది లేకుండా తాము నేటి నుంచి తలపెట్టిన సమ్మెను విరమించినట్లు జిన్నింగ్ మిల్లుల యజమా నులు పేర్కొన్నారు.
సీసీఐ నిబంధనలు కఠినతరం
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనలను కఠినతరంగా ఉన్నాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా జిన్నింగు మిల్లుల యజమానులు గురువారం నుంచి పత్తి కొనుగోళ్లు నిరవధికంగా నిలిపివేస్తామని ప్రకటించారు. గతం తో పోలిస్తే ఈసారి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోళ్లలో నిబంధనలను కఠినతరం చేయడం వల్ల అటు రైతులకు, ఇటు జిన్నింగు మిల్లు యజమానులకు పత్తి కొనుగోళ్లు ఇబ్బందికరంగా మారాయని మిల్లర్లు చెబుతున్నారు. గతంలో జిల్లాల వారీగా సీసీఐ పత్తి కొనుగోలుకు మిల్లులను ఎంపిక చేసి పరిమితి లేకుండా ఇతర జిల్లాల నుంచి కూడా రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయడానికి అనుమతి ఇచ్చేది.
ఇప్పుడు అలా కాకుండా ఉమ్మడి జిల్లాకే పరిమితం చేయడం, ఎల్ 1, ఎల్ 2 పేరుతో మిల్లులను విభజించి పత్తి కొనుగోలుకు టార్గెట్ పూర్తి చేసిన తర్వాత మరో మిల్లుకు పత్తి కొనుగోలుకు అవకాశం కల్పించడం సరైంది కాదని పేర్కొంటున్నారు. అలాగే గత ఏడాది ఎకరానికి 12 క్వింటాల వరకు రైతు నుండి పత్తి కొనుగోలు చేయడానికి అనుమతి ఇవ్వగా ఈసారి ఏడు క్వింటాలకే కుదించారని ఇది ఆటంకంగా మారుతోందని, ఇలా రకరకాల కొత్త నిబంధనలతో అటు మిల్లర్లకు, ఇటు రైతులకు పత్తి కొనుగోళ్లలో సీసీఐ క్లిష్టమైన నిబంధనలతో పత్తి కొనుగోలు నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల జిన్నింగ్ మిల్లర్లు ప్రకటించారు.