22-01-2026 01:29:31 AM
‘తుంబాడ్’ వంటి వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు దర్శకుడు రాహి అనిల్ బార్వే. ఇప్పుడు మరో సరికొత్త కథ చెప్పబోతున్నారాయన. రాహి దర్శకత్వంలో రూపొందుతున్న మరో ప్రయోగాత్మక హిందీ చిత్రం ‘మయసభ’. ‘ది హాల్ ఆఫ్ ఇల్యూజన్’ అనేది ట్యాగ్‌లైన్. పికెల్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై గిరీశ్ పటేల్, అంకూర్ జే సింగ్ నిర్మిస్తున్నారు. జావేద్ జాఫ్రీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వీణా జామ్కర్, దీపక్ దామ్లే, మహమ్మద్ సమద్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఓ దర్శకుడి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. జనవరి 30న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ బుధవారం రిలీజ్ చేశారు.
‘బంగారం వేటకు మీకు స్వాగతం’ అంటూ సాగుతున్న ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఒక పాత థియేటర్ నేపథ్యంలో సాగే మిస్టరీ థ్రిల్లర్ చిత్రమని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ట్రైలర్ నిగూఢమైన రహస్యం, భ్రమలు, వాస్తవికత వంటి థ్రిల్లింగ్ అంశాలతో ఉంది. ఇందులో జావేద్ జాఫ్రీ ఎన్నడూచూడని సరికొత్త గెటప్‌లో కనిపించారు. తన 40 ఏళ్ల కెరీర్‌లో తాను చదివిన అత్యుత్తమ స్క్రిప్ట్ అని జావేద్ పేర్కొనడం ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఈ చిత్రానికి సాగర్ దేశాయ్ నేపథ్య సంగీతాన్ని అందిస్తుండగా, కుల్దీప్ మమానియా సినిమాటోగ్రాఫర్‌గా, ఆసిఫ్ పఠాన్ ఎడిటర్‌గా, సురేంద్ర ప్రజాపతి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.