రాహుల్, ఒవైసీలది ఔరంగజేబ్ స్కూలే

25-04-2024 02:27:32 AM

l కాంగ్రెస్ హయాంలోనే శ్రీలంకకు కచ్చతీవు

l దేశంలో అణ్వాయుధాలు వద్దంటున్న రాహుల్  

l డోక్లాం  ఘటనలో చైనాకు అనుకూలంగా వ్యాఖ్యలు 

l కాంగ్రెస్ పాలనలో లవ్ జిహాద్‌తో మహిళల హత్య

l కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్

హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): రాహుల్ గాంధీ, ఒవైసీ ఇద్దరూ ప్రజాస్వామ్యం గురించి వల్లె వేస్తారని.. కానీ వారి మనసుల్లో ఉన్నది మాత్రం షరియా అని, వారిద్దరూ ఔరంగ జేబ్ స్కూల్‌కు చెందిన వారని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి సనాతన ధర్మంపై విశ్వాసం లేదని, మెజారిటీ ప్రజలపై వారికి అభిమానం కనిపించడం లేదని అన్నారు.

రాహుల్ గాంధీ, ఒవైసీది ఒకటే అజెండా అని మత రాజకీయాలకు పాల్పడటమే వారికి తెలుసని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఠాకూర్ మాట్లాడారు. వివిధ దేశాల మధ్య యుద్ధం నడుస్తుంటే, ప్రపంచంలో ఎప్పుడు ఏ దేశంపై దండెత్తుతుందో తెలియని పరిస్థితి ఉంటే ఇప్పుడు మన దేశంలో అణ్వాయుధాలను నిర్మూలించాలని రాహుల్‌గాంధీ అంటున్నారని.. తద్వారా దేశాన్ని బలహీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చైనా, పాకిస్తాన్ మన దేశానికి చెందిన భూభాగాన్ని ఆక్రమిస్తే, కచ్చతీవు దీవులను అదే ప్రభుత్వం శ్రీలంకకు అప్పగించిందని మండిపడ్డారు.

డోక్లాం ఘటన సమయంలో రాహుల్ గాంధీ చైనా సైనికులకు అనుకూలంగా మాట్లాడి మన సైనికుల మానసికస్థుర్యైన్ని దెబ్బతీయాలని చూశారని ఆరోపించారు. దేశ రక్షణ పట్ల ఆయనకున్న జవాబుదారీతనం ఇదేనా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు దేశం వైపున్నాయా.. విదేశాల వైపున్నాయా అని అన్నారు. మోదీ పాలనలో సరిహద్దులను అత్యంత శత్రు దుర్బేధ్యంగా మార్చేశామని తెలిపారు. సరిహద్దుల్లో వేలాది కిలోమీటర్ల రోడ్లు, మౌలిక వసతులు కల్పించామని స్పష్టంచేశారు. సరిహద్దు భద్రత, అంతర్గత భద్రత రెండింటినీ పటిష్టం చేసిన ఘనత మోదీ సర్కారుకు దక్కుతుందన్నారు. 

కాంగ్రెస్ వస్తే లవ్ జిహాద్ చెలరేగుతుంది..  

కర్ణాటకలో కాంగ్రెస్ కార్పొరేటర్ కూతురు లవ్ జిహాద్‌కు బలి అయ్యిందని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని బాధితులు కోరినా అక్కడి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా హిందూ మహిళలు లవ్ జిహాద్‌కు బలి అవుతున్నారని పేర్లతో సహా వెల్లడించారు. కాంగ్రెస్ వస్తే లవ్ జిహాద్ పెరిగిపోతుందని, సనాతన ధర్మానికి తూట్లు పొడుస్తారని ఆరోపించారు. ఎంత మందిని లవ్ జిహాద్ పేరిట చంపేస్తారని ప్రశ్నించారు. కర్ణాటక అసెంబ్లీ పాకిస్తాన్ జిందాబాద్ వ్యాఖ్యలు చేసినా కాంగ్రెస్ నాయకులకు కనిపించడంలేదా? అని నిలదీశారు. కాంగ్రెస్ పాలనలో మహిళల అణచివేత జరగగా.. మోదీ పాలనలో త్రిపుల్ తలాక్ రద్దు, 33 శాతం మహిళా రిజర్వేషన్లు ఇచ్చామని అన్నారు.

సంపద పున:పంపిణీ అని రాహుల్ గాంధీ అంటుంటే, కాంగ్రెస్ నాయకుడు శ్యాం పిట్రోడా వారసత్వపు పన్ను విధించాలని అంటున్నారని దీంతో భవిష్యత్తు తరాలను వీరు ఏం చేయాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. పుట్టుక నుంచి మరణం దాక పన్నులు వసూలు చేయడమే కాంగ్రెస్ సిద్ధాంతమని ధ్వజమెత్తారు. 75 ఏళ్లుగా దేశంలోని ప్రజలను పేదరికంలో మగ్గేలా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. తెలంగాణలో ఖజానాను కేసీఆర్ ఖాళీ చేశారని, కొత్త ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో కేంద్రం వైపు చూస్తోందని అన్నారు. మోసపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాటిని అమలు చేయలేకపోతున్నదన్నారు. 

అక్కడ రాహుల్ ఓడారు.. ఇక్కడ ఒవైసీ ఓడిపోతారు

ఒవైసీ ఇన్నాళ్లుగా దొంగ ఓట్లతో గెలిచారు.. ఇప్పుడు ఆయన దుకాణం బంద్ అవుతుందని, హైదరాబాద్‌లో కమలం వికసిస్తుందని ఠాకూర్ అన్నారు. మాధవీలతను ఓడించేందుకు మజ్లిస్, కాంగ్రెస్ ఒక్కటయ్యాయని.. ఎవరు, ఎవరికి బీ టీం అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పారు. ‘15 నిమిషాలు పోలీసులను ఆపండి.. మొత్తం నాశనం చేస్తాం’ అని అన్నా కాంగ్రెస్ వాళ్లకు కనిపించదని అన్నారు అమేథీలో రాహుల్ గాంధీని ఓ మహిళ ఎలా ఓడించిందో.. హైదరాబాద్‌లో ఒవైసీని కూడా ఓ మహిళే ఓడిస్తుందని స్పష్టంచేశారు. ఇన్నాళ్లు దొంగ ఓట్లతో గెలిచిన ఒవైసీ ఆటలు ఇక సాగబోవని చెప్పారు. మహిళా బిల్లును కాంగ్రెస్ ఇవ్వలేదని, మోదీ ఇచ్చారని, బీజేపీ ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తుందని పునరుద్ఘాటించారు. మహిళా బిల్లుపై ఎంఐఎం విధానం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కుల మతాలకు అతీతంగా సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ తమ నినాదమని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణలో డబుల్ డిజిట్ పక్కా..

కాంగ్రెస్‌కు కనీసం 300 సీట్లలో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకడం లేదని, వాయనాడ్‌లో రాహుల్ గాంధీ ఓడిపోతానని భయపడుతున్నారని ఠాకూర్ ఎద్దేవాచేశారు. బీజేపీ ఇప్పటికే ఓ సీటులో ఏకగ్రీవంగా గెలిచిందని 400 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో తొలిసారిగా తాము డబుల్ డిజిట్ దాటబోతున్నామని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు.

తెలంగాణలో చేసిన అవినీతి సరిపోలేదని ఢిల్లీకి వచ్చి లిక్కర్ స్కాంలో అవినీతికి పాల్పడ్డారంటూ కవిత అరెస్టుపై బీఆర్‌ఎస్ నేతలను విమర్శించారు. డీడీ లోగో కాషాయ రంగులోకి మార్చడంపై స్పందిస్తూ ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు లోగో రంగు మార్చారని.. ఇప్పుడు ఆ శాఖ మంత్రిగా ఉన్న తన హయాంలో బ్లాక్ అండ్ వైట్ రంగులో ఉన్న లోగోను కలర్‌పుల్‌గా మార్చినట్టు స్పష్టంచేశారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కాసం వెంకటేశ్వర్లు, కొల్లి మాధవి, మీడియా ఇంచార్జి ఎన్వీ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.