calender_icon.png 3 August, 2025 | 12:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాకాసి కొంగ ముక్కు చీల్చిన రాజగోపాలుడు

28-12-2024 12:00:00 AM

ఈ పాశురంలో శ్రీరాముడిని, శ్రీ కృష్ణుడిని కీర్తిస్తారు. తొండరడిప్పొడియాళ్వార్ కూడా తన తిరుమాలై గ్రంథంలో రామకృష్ణులను సమంగా స్తుతిస్తారు.  కొంగ దంభానికి, రావణుడు అహంకారానికి ప్రతీకలు. మథురలో పుట్టి బృందావనంలో తిరుగాడే గోపికలు కృష్ణుని కాక రాముని తలవడం ఏమిటి? అయోధ్యలో రాముడు రాముడు అనే తప్ప మరో మాట ఎరుగరు.

నందవ్రజంలో కృష్ణుడిని గాక అన్యనామం ఎందుకు తలుస్తారు? ఈ పాశురంలో రాముడా కృష్ణుడా ఎవరు మిన్న అనే వాదం సాగుతుంది. ఆకారాలు వేరుగా ఉన్నా ఇరువురూ పరమాత్మ స్వరూపాలే కదా అని నిర్ధారణకు వస్తారు. భద్రుడి తపస్సు మెచ్చి విష్ణువు అవతరిస్తే ఆయన,  ‘నువ్వెవరు? నేను నిన్నెరుగను.

నాటి రూపుచూప నమ్మగలను’ అంటాడట. సరే అని శ్రీరాముని ఆకారంలో కనిపిస్తే తప్ప ఆయనకు తృప్తి కలగలేదు. శంఖచక్రాలు ధనుర్బాణాలతో శ్రీరాముడు ఉండడం సాధారణంగా మనకు తెలియదు. కాని భద్రాచలంలో ఆయన రూపం అది. 

శ్రీ కృష్ణుడిని ఊయలలో నిద్ర పుచ్చుతూ, ‘అనగా అనగా రాముడనే బాలుడుండేవాడు’ అని యశోద కథ మొదలుపెట్టింది. కిట్టయ్య ‘ఊఊ’ అన్నాడు. రాముడికి సీత అనే భార్య ఉంది. చిట్టి కిట్టయ్య ‘ఊహూ ఊ’ అన్నాడు మళ్లీ. తండ్రి మాటకోసం అడవులకు వెళ్లారు. ‘ఊఊ..’ ‘అక్కడ సీతమ్మను రావణుడు అపహరించాడు’ అని యశోద చెప్పగానే ఆవేశంతో ‘లక్ష్మణా ధనుస్సు ధనుస్సు, ఏది ధనుస్సు ఎక్కడ?’ అని ఆవేశంతో అరుస్తూ లేచాడట. రాముడు కృష్ణుడు ఒక్కరే అనడానికి ఇంకే ప్రమాణం కావాలి?  

పుళ్లిన్ వాయ్= కొంగ (బకాసురుని) నోటిని, కీన్దానై= చీల్చిన శ్రీకృష్ణుని, పొల్లా= దుష్టుడైన: అరక్కనై= రావణాసురుడి తలలను, క్కిల్లి= త్రుంచి, క్కళన్దానై= పారవేసిన శ్రీరాముని, కీర్తిమై= కీర్తిని, పిళ్లెగళ్= పిల్లలు, ఎల్లారుమ్= ఎల్లరును, ప్పాడి= గానం చేసి, ప్పోయ్= వెళ్తూ, పావైక్కళం= వ్రతం చేసే ప్రదేశాన్ని, పుక్కార్= ప్రవేశించారు. వెళ్లి= శుక్రుడు, ఎజుందు=ఉదయించి, వియాజమ్ గురు(వారం) అస్తమించాడు, పుళ్లుమ్ =పక్షులును, శిలంబినకాణ్= కిలకిల రావములు చేస్తున్నాయి, పోదు= తామర పుష్పంలోని, అరి= తుమ్మెదల వంటి, కణ్ణినాయ్= కన్నులున్న దానా, పావాయ్= ఓ సుకుమారి, నీ= నీవు, నన్నాళాళ్= ఈ మంచి రోజున, కుళ్లక్కుళిర = చల్లచల్లగా, కుడైందు= అవగాహనం చేసి, నీరాడాదే= స్నానం చేయకుండా, పళ్లిక్కిడత్తియో= పాన్పుపై పడుకొని ఉన్నావా? కళ్లమ్= కపట స్వభావాన్ని, తవిర్ న్దు= వదిలి, కలన్దు= మాతో చేరు.

కొంగ రాక్షసుడు బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుడు, రావణుని తలలు గిల్లి పారేసిన శ్రీరాముని కీర్తిస్తూ గోపికలందరూ వ్రతస్థలికి చేరుకున్నారు. గురుడు అస్తమించి శుక్రుడు ఉదయిస్తున్న వేళ, పక్షులు గలగలా ఆహారపు వేటకు వెళ్తున్నాయి. తుమ్మెద దూరిన తామెర పూవు వంటి కన్నులదానా సుకుమారీ, శ్రీకృష్ణుని గుణానుభవాన్ని నీవొ క్క దానివే అనుభవించాలనే కపట స్వభావా న్ని వదిలి మా అందరితో చేరి చల్లని నీటిలో స్నానం చేయకుండా ఇంకా పాన్పుపై పడుకోవడం ఎందుకు? కొంగ అంటే దంభము.

ఇతరులను హింసించడం అతని ప్రవత్తి. కాని పైకి సజ్జనుడివలె కనిపించే ప్రయత్నం. ఇదే దంభము. రావణుడనే వాడు అహంకారానికి ప్రతీక. ఈ రెండూ తొలగాలంటే ఆచార్యుడి ద్వారా వచ్చిన భగవన్నామ కీర్తన ఒక్కటే మార్గం. శుక్రుడు జ్ఞానం, బృహస్పతి అజ్ఞానానికి సంకేతం. పక్షులంటే ఆచార్యులు. నేత్రమంటే జ్ఞానం. నేత్ర సౌందర్యమంటే భాగవతోత్తముల స్వరూపం తెలుసుకోగలగడం, స్నానమంటే భగవద్గుణానుభవం. భగవంతుని అనుభవం అందరితో కలిసిచేయాలి. ఒంటరిగా చేయడమంటే దంభం.