28-12-2024 12:00:00 AM
ప్రతి మనిషిలోనూ దేవుడు ఉన్నాడన్న అద్వైత తత్తం అంతటితో ఆగలేదు. సమస్త ప్రాణుల్లోను, చివరకు వస్తువుల్లోనూ, అణువణువునా పరమాత్మ ఉంటాడని ఉద్ఘాటించింది. ఇంత గొప్ప దైవిక సిద్ధాంతం మరొకటి ఉంటుందా? ఇంతటి సమదర్శన దృష్టి, దృక్పథం గలవారే నిజమైన పండితులుగా మన్ననలు పొందగలరు. అటువంటి మహానుభావులైన ఒక గుండేరావ్ హర్కారే, ఓ గోపదేవ శాస్త్రి, ఒక వేటూరి ఆనందమూర్తి..
ప్రభృతులు మార్గదర్శకులుగానే కాక గురువులుగానూ లభించడం నా పూర్వజన్మ సుకృతమే. వారి కోవలోని వారే చారిత్రక నవలా చక్రవర్తిగా పేర్గాంచిన ముదిగొండ శివప్రసాద్. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నాకు ఎంఏలో చదువు చెప్పిన గురువులు. అంతేకాదు, నేను సహాచార్యునిగా విశ్వవిద్యాలయంలో చేరినప్పుడు నన్ను అంతే వాత్సల్యంతో ఆదరించారు.
ఒక ఆధునిక యోగికి ఉండవలసిన లక్షణాలన్నీ నేను ముదిగొండ వారిలో దర్శించాను. ఎంతో నిరాడంబరమైన జీవనం. సనాతన ధర్మం పట్ల ఎంత అనురక్తియో భూతదయ పట్ల అంతే భక్తి భావనను ఆయనలో చూశాను. దీనికి ఉదాహరణే నేనెప్పటికీ మరిచిపోకుండా ఉన్న ఆనాటి ఆ సంఘటన.
అప్పట్లో మేం పని చేసిన ఓయూకు చెందిన పీజీ కాలేజీ, సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్‌లో రోడ్డుకు అభిముఖంగా ఉండేది. ఒకరోజు శివప్రసాద్ బస్సు దిగి, కళాశాల గేటు దాటి లోపలికి ప్రవేశించారు. నేను ‘సార్ ఎప్పుడు వస్తారా?’ అని కాలేజీ పైఅంతస్తు నుంచి చూస్తున్నాను. ఆయన గేటు లోపలికి రాగానే తన రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టారు. నిజానికి వారి ముందు ఎవరూ లేరు. మనుషులెవరూ కనిపించనప్పటికినీ ‘ఆయన ఎవరికి నమస్కారం పెట్టినట్టు?’ ఈ సందేహం నన్ను వదల్లేదు. వెంటనే ఆయన్ను అడిగే అవకాశం రాలేదు.
ముందు అంతర్యామిని చూడాలి!
‘క్లాసుకు వెళ్తున్నారు కనుక వారిని డిస్టర్బ్ చేయరాదని’ మౌనంగా ఉండిపోయాను. సాధారణంగా మొద టి గంట వారే క్లాసు తీసుకొనేవారు. ఎప్పుడైనా నేను క్లాసు తీసుకుంటూ ఉంటే, వారిని చూడగానే బయటికి వస్తాను. వారు క్లాసు రూపంలోకి ప్రవేశించి పాఠం చె ప్పేవారు. శివప్రసాద్ పదవీ విరమణకు దగ్గరగా వచ్చి న వారు కనుక నేనెప్పుడూ తనకు ఇబ్బంది కలిగించేవాణ్ణి కాదు. క్లాసు తీసుకుని స్టాఫ్ రూమ్‌లోకి వచ్చాక, శివప్రసాద్ నన్ను చూసి, “ఏదో అడగాలని చూస్తున్నావు. అడుగు, ఫరవాలేదు..” అన్నారు. వెంటనే నేను “మనుషులు ఎవరూ లేకపోయినా మీరు నమస్కారం చెప్పారు. ఎవరికి? అని నా సందేహం..” అన్నాను.
“ఓ అదా? నిజమే. అక్కడ మనుషులు ఎవరూ లే రు. కాని, ఒక శునకం నన్ను చూస్తూ ఎదురు వచ్చింది. బహుశా అది నువ్వు గమనించలేదు. నేను వెంటనే ఏ మీ ఆలోచించకుండా దానికి నమస్కారం చేశాను..” అ న్నారాయన. “శునకానికా..!?” ఆశ్చర్యం వ్యక్తం చేశాను. దానికి బదులుగా చిరునవ్వు నవ్వుతూ ఆయనన్నారు
“ఏం, మనుషులకు నమస్కరించినపుడు కుక్కకు నమస్కరిస్తే తప్పేమిటి? కుక్క సేవాధర్మానికి ప్రతీక. మనిషి కంటే ఎక్కువ విశ్వాసం కల్గింది కూడా. దేవుడు అంతటా ఉన్నప్పుడు, శునకంలోను ఉంటాడు కదా. అన్ని ప్రాణుల్లో దైవాన్ని దర్శించమని మన ఉపనిషత్తులు ఉద్ఘోషిస్తున్నాయిగా. నిజానికి నేను చేసిన నమస్కారం భగవంతునికే సుమా. అంతా శివమయమే అయినప్పడు శివుడు కాని వస్తువు మనకెక్కడ లభిస్తుంది? సర్వాత్మ భావనతో శునకంలోనూ అంతర్యామిగా ఉన్న పరమాత్మను దర్శించాకే, ఆ ప్రాణికి మనస్ఫూర్తిగా నమస్కరించాను..” అంతటితో ముదిగొండ వారు ఆపకుండా ఇంకా ఇలా చెప్పారుె
“పండితుడంటే సమదర్శకుడు. అన్ని ప్రాణుల్లోనే కాదు, అన్ని పదార్థాల్లోనూ సమానంగా ప్రకాశించే పరమాత్మను దర్శించే వాడే నిజమైన పండితుడు.” అప్పట్నుంచీ ఆయనపట్ల నా గురుభావన అంతకంతకూ ఎక్కువైంది.
ఆచార్య మసన చెన్నప్ప వ్యాసకర్త సెల్: 9885654381