దేశాన్ని ఆధునికతవైపు నడిపిన దూరదృష్టి గల నాయకుడు రాజీవ్ గాంధీ
- భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
- ఘనంగా రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు
భూపాలపల్లి టౌన్, ఆగస్టు 20 (విజయక్రాంతి) : దేశాన్ని ఆధునికత వైపు నడిపిన దూరదృష్టి కలిగిన నాయకుడు దివంగత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్ గాంధీ అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బట్టు కర్ణాకర్ అన్నారు. కర్ణాకర్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు గురువారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించగా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి కేకు కట్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంప్యూటర్, టెలి కమ్యూనికేషన్, సాంకేతిక రంగాల అభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన కృషి భారతదేశ ప్రగతికి బలమైన పునాదులు వేసిందని పేర్కొన్నారు. ముఖ్యంగా యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించడం ద్వారా దేశ ప్రజాస్వామ్యంలో యువత భాగస్వామ్యాన్ని పెంచిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందని తెలిపారు. రాజీవ్ గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని దేశ అభివృద్ధి, యువత సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దాట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






