calender_icon.png 8 August, 2025 | 8:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నా చెల్లెల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రాఖీ పర్వదినం

08-08-2025 06:06:34 PM

చండూరు (విజయక్రాంతి): శ్రావణ పౌర్ణమి.. రాఖీ పౌర్ణమి.. రక్షాబంధన్ పండుగంటే.. అన్నా చెల్లెలు... అక్క తమ్ముళ్ల పండుగ. పురాణాల ప్రకారం ఈ పండుగ కృతయుగం నుంచి ఆచరిస్తున్నారు. అన్నా చెల్లెలు.. అక్క తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలతో ఈ పండుగను జరుపుకుంటారు. రక్షాబంధన్(Raksha Bandhan) పండుగను రాఖీ పండుగని, రాఖీ పౌర్ణమి అని అందరూ అంటారు. ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు. రాఖీ పౌర్ణమి రోజు సోదర, సోదరీమణుల రక్షాబంధనాన్ని కట్టుకున్న తర్వాత విశేషమైన ఫలితాలను పొందుతారంట. రాఖీ పండుగ రోజు సోదరుడు.. సోదరి.. తప్పనిసరిగా అన్నదానం చేస్తే, పదిమందికి భోజనం పెడితే వారికి శుభం చేకూరుతుందని శాస్త్రం చెప్తుంది.

అంతేకాదు మరణం తర్వాత పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయని పెద్దలు చెప్తారు. ఒకప్పుడు ఉత్తర, పశ్చిమ భారతదేశలలో ని ప్రజలు మాత్రమే అపూర్వంగా జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరి తన సోదరుడు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ రాఖీ కట్టి ఎప్పుడూ అన్నకు అండగా ఉండాలని కోరుకుంటారు. సోదరీ కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తాను ఎప్పుడూ చెల్లెలికి రక్షగా ఉంటానని తెలియజెప్పడమే ఈ పండుగ విశిష్టత. అన్నా చెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రాఖీ పర్వదినం. సోదరుడుకి కట్టే రాఖీలు సోదరీమణులకు రక్షణ కవచంగా నిలుస్తాయని విశ్వాసం. పాత రోజులలో అతి పెద్దగా ఉండే రాఖీలు ధరించేవారు రాను రాను అవి చిన్నవిగా మారిపోయాయి.

హిందువుల పండుగలో ముఖ్యమైన పండుగ రాఖీ ఒకటి. ఈ పండుగ సోదరా సోదరీమణులకు మధ్య ప్రేమ గుర్తుగా పేరుగాంచింది రాఖీ కట్టిన తర్వాత తన సోదరికి సోదరుడు తన జీవితాంతం అండగా ఉంటానని మాట ఇస్తాడు. తనకు రాఖీ కట్టిన సోదరికి ఏదైనా చిరు కానుకగా బహుమతి ఇచ్చి జీవితాంతం కాపాడతానని హామీ ఇచ్చినట్లు భావిస్తారు. ఈ పండుగ ప్రతి సంవత్సరం శ్రావణమాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. రక్షాబంధన్ అనే పదం రక్ష, బంధన్ అనే రెండు పదాలతో ఏర్పడింది. దేవత మూర్తుల కాలం నుంచి ఈ పండుగను జరుపుకుంటున్నట్లుగా చరిత్ర ద్వారా తెలుస్తుంది.

 రాఖీ పండుగ ఎందుకు జరుపుకుంటారు అంటే...

ఒకరోజు శ్రీ గణేశుడు తన సోదరి మానస దేవితో రాఖీ రాఖీ కట్టించుకుంటుండగా అప్పుడు ఇద్దరు కుమారులు శుబ్, లాబ్ లు, ఇది ఏంటని అడిగారంట. అందుకు గణేశుడు ఇది రక్షణ కవచం అని ఈ రక్షా సూత్రం సోదరీ సోదరీమణులకు మధ్య ప్రేమకు ప్రతీక అని చెప్పాడంట. ఇది విన్న శుబ్, లాబ్ లు తమకి కూడా ఒక సోదరి కావాలని పట్టుబట్టగా తన కుమారుల కోరిక మేరకు గణేశుడు తన శక్తుల నుంచి ఒక మంటను సృష్టించి దానిని తన భార్యలు సిద్ధి, బుద్ధిల ఇద్దరి ఆత్మ శక్తితో కలిపి ఆ వెలుగు నుంచి ఒక అమ్మాయి జన్మించింది. ఆ అమ్మాయికి సంతోషిమాత అని పేరు పెట్టారంట. ఆ రోజు నుండి రాఖీ పండుగకు ఒక ప్రత్యేకత ఏర్పడింది. అప్పటినుండి ఇప్పటివరకు రాఖీ పండుగ తెలంగాణ సంప్రదాయలలో ఒక ముఖ్యమైన పండుగ.

 కిటకిటలాడుతున్న ఆర్టీసీ బస్సులు, రాఖీ దుకాణాలు

రాఖీ పండుగకు ఒక్క రోజు ముందే దూర ప్రాంతాల నుండి మహిళలు ఆర్టిసి బస్సులలో కాలు తీసి కాలు పెట్టే చోటు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకపక్క బస్సులలో మహిళలు, మరోపక్క రాఖీ దుకాణాల వద్ద జన సందోహం తీవ్రంగా కనిపిస్తుంది. అలాగే సోదరుడికి రక్షాబంధన్ కట్టిన తర్వాత హారతి ఇచ్చి నోరుని తీపి చేసేందుకు స్వీట్స్ వాడుతుంటారు. అందులో భాగంగానే స్వీట్స్ దుకాణాల వద్ద ప్రజలు కుప్పలు కుప్పలుగా ఉండడం విశేషం. అర్చకుల పంచాంగం ప్రకారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రాఖీ పండుగను జరుపుకోవాలని, ఆ సమయంలో సోదరీమణులు, తమ సోదరులకు రాఖీలు కట్టవచ్చని వేద పండితులు తెలిపారు.