08-08-2025 07:37:32 PM
పరీక్ష వ్రాయడానికి వచ్చిన..
కరీంనగర్ (విజయక్రాంతి): కోటి ఆశలతో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఓ యువతి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. పరీక్ష వ్రాయడానికి వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన విషాదాన్ని నింపింది. కరీంనగర్ జిల్లా(Karimnagar District) చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన ముద్దసాని అఖిల ధర్మపురి మండలానికి చెందిన రాజు అనే యువకులతో మూడు రోజుల క్రితం వివాహమైంది. ఇటీవల డిగ్రీ పూర్తి చేసిన అఖిల.. పీజీ విద్యను అభ్యసించేందుకు తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో గల వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలోని అయాన్ డిజిటల్ జోన్ లో పీజీ ప్రవేశ పరీక్ష రాసేందుకు హాజరైంది.
పరీక్ష ముగించుకొని తిరిగి భర్త రాజుతో కలిసి బైక్ పై కరీంనగర్ వైపు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో దంపతులిద్దరూ కింద పడిపోయారు. అఖిల రోడ్డుపై మధ్యలో పడిపోవడంతో వెనుక నుండి వచ్చిన లారీ ఆమె తలపై నుండి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. రాజు గాయపడగా ఆసుపత్రికి తరలించారు. ఎల్ఎండి పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి అఖిల మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల కిందనే పెళ్లయిన అఖిల జీవితం అర్ధాంతరంగా ముగిసిందని తెలుసుకున్న పలువురు స్థానికులు, ప్రయాణికులు సంఘటన స్థలానికి చేరుకొని దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.