calender_icon.png 1 May, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామగుండంలో ఏ ట్యూబ్ ల ఆటలు పనిచేయవు

30-04-2025 10:25:15 PM

నేను ఉన్నంతకాలం మెడలో ట్యాగులు వేసుకొని తిరిగితే భయపడేది లేదు..

వ్యాపార, మెడికల్ రంగాలకు నేను అండగా ఉంటా..

తోక తొండం లేని పేపర్లు పట్టుకొని వస్తే సహించబోయేది లేదు..

రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ హెచ్చరిక..

గోదావరిఖని (విజయక్రాంతి): మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు హెచ్చరిస్తున్నట్టు.... రామగుండంలో కూడా కొంతకాలంగా తోక తొండం లేని పేపర్లు... యూట్యూబర్లు  తయారై పత్రికా రంగంకు చెడ్డ పేరు తీసుకువస్తున్నారు... ఆ చోట మోటా పేపర్ల ఆటలు ఇక సాగనివ్వను... ఈ ప్రాంతంలోని విద్యా సంస్థలకు, వ్యాపార వాణిజ్య సంస్థలకు, మెడికల్ షాపులు, హాస్పిటళ్లకు నేను అండగా ఉంటాను... ఇక్కడ నేను ఉన్నంతకాలం ఎవ్వరి ఆటలు సాగనివ్వను... దేనికంటే దానికి సిద్ధమే. మరోసారి హాస్పిటల్లో పై దాడులకు, బ్లాక్ మెయిల్ లకు పాల్పడితే తానేంటో చూపించాల్సి వస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల గోదావరిఖని నగరంలోని మమత హాస్పిటల్ లో జరిగిన సంఘటన నేపథ్యంలో బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రైవేటు వైద్యలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. రామగుండంలో మెడికల్ హబ్ గా తీర్చిదిద్దాలని తాను కంకణం కట్టుకున్నానని చెబుతూనే కొంతమంది జర్నలిస్టులను ఉద్దేశించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కొంతమంది సొంతగా పేపర్లు పెట్టుకున్నామని మెడలో ట్యాగులు వేసుకొని తిరిగినంత మాత్రాన జర్నలిస్టులు కాలేరని, ఒక సందర్భంలో తనకు కూడా అనుభవం ఎదురయిందని, ఒక వ్యక్తి (పేరు చెప్పకుండా) తను జర్నలిస్టు అని, 20 ఏళ్ల సీనియార్టీ ఉందంటూ తన వద్దకు వచ్చాడని, ఈ 20 ఏళ్లు నేను కూడా రాజకీయాలలో ఉన్నానని మరి నిన్ను ఎప్పుడూ నేను చూడలేదని ప్రశ్నించగా, సదరు వ్యక్తి సొంతగా పేపరు పెట్టుకున్నానని, మాజీ ఎమ్మెల్యే కొంత ఇచ్చాడని, మీరెంత ఇస్తారని నన్నే  డబ్బులు డిమాండ్ చేశాడని, కానీ నేను ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదంటూ తిప్పి పంపించానని చెప్పారు.

అలాగే చిన్నచిన్న చోట మోట పేపర్లు వార్తల మాదిరిగా డిజైన్లు చేసి సోషల్ మీడియాలో ఉదయం లేచింది రాత్రి వరకు పోస్టులు పెడుతూనే ఉంటున్నారని, చాలా రోజులుగా ఇది నేను గమనిస్తున్నానని, త్వరలోనే వాళ్ళ ఆటలు సాగకుండా చట్టపరంగా ముందుకు వెళ్లాల్సి వస్తుందని ఎమ్మెల్యే హెచ్చరించారు. కొందరైతే విద్యాసంస్థలు, మెడికల్ షాపులు, హాస్పిటల్, వ్యాపార సంస్థల వద్దకు వెళ్లి వార్తలు రాయకుండా ఉండాలంటే తమకు ఎంతో కొంత ఇవ్వాలని బెదిరిస్తున్నట్లు తన దృష్టికి చాలాసార్లు వచ్చిందని, అలాంటి వారి సంగతి త్వరలోనే చెబుతానని హెచ్చరించడంతో అక్కడ ఉన్న జర్నలిస్టులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టినప్పటి నుండి తను భాగస్వామిగా ఉన్నానని, రామగుండంలో హైదరాబాద్ తరహాలో ప్రైవేట్ హాస్పిటల్ లు వచ్చేలా కృషి చేస్తున్నానని పేర్కొన్నారు.

ఇటీవల ఓ వైద్యాధికారి మమత హాస్పిటల్ లో  స్కానింగ్ యంత్రం తనిఖీ చేయడానికి వచ్చినప్పుడు ఒక నోటీస్ ఇచ్చి వెళ్ళిపోవాల్సి ఉండేదని, అక్కడే ఉండి కేస్ ఫైల్ చేస్తానంటూ రాద్ధాంతం చేయడం  సరైన పద్ధతి కాదని చెబుతూనే మరోసారి ప్రైవేట్ హాస్పిటల్ ల పైన, మెడికల్ షాప్ ల పైన తనిఖీలు చేయవద్దని మీడియా తరఫున సంకేతాలు ఇవ్వడం అందరినీ విస్మయానికి గురిచేసింది. పిడిఎఫ్ పేపర్లు పట్టుకొని  బయట తిరుగుతూ ఇష్టం వచ్చినట్లుగా వార్తలు పోస్ట్ చేస్తుంటే ఊరుకునే ప్రసక్తి లేదంటూ హెచ్చరించారు. ఇది ఇలా ఉండగా మమత హాస్పిటల్ ఘటనపై రామగుండం ఎమ్మెల్యే స్పందించిన తీరు జర్నలిస్టు వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ఒకరకంగా ప్రైవేటు హాస్పిటల్ కు మద్దతు పలుకుతున్నట్లు తెలుస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు.