నవ్వులు పంచే రంభ ఊర్వశి మేనక
కామెడీ కింగ్ అల్లరి నరేశ్ తనను స్టార్ హీరోగా నిలబెట్టిన కామెడీ జానర్‌లో మరోసారి సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న 65వ చిత్రానికి చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్నారు. ఫాంటసీకి వినోదాన్ని జోడిస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘కామెడీ గోస్ కాస్మిక్‘ అనేది ట్యాగ్‌లైన్. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేశ్ దండా, నిమ్మకాయల ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మంగళవారం అల్లరి నరేశ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ చిత్రబృందం ఈ మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. దీనికి ‘రంభ ఊర్వశి మేనక’ అనే టైటిల్ ఖరారు చేశామని ప్రకటిస్తూ, విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో అల్లరి నరేష్ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు.
ఆయన స్వర్గలోకపు మెట్లపై కూర్చుని, చేతిలో కలం, ’రంభ, ఊర్వశి, మేనక’ పేర్లు రాసి ఉన్న పేపర్ పట్టుకుని ఉండగా, పైన మేఘాల మధ్య అప్సరసలు కనిపిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, నరేశ్ వీకే, శ్రీనివాస్‌రెడ్డి, మురళీధర్‌గౌడ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రామ్‌రెడ్డి; సంగీతం: చైతన్ భరద్వాజ్; ప్రొడక్షన్ డిజైన్: బ్రహ్మ కడలి; ఎడిటర్: చోటా కే ప్రసాద్.






