ఇక ఇండియాలోనే రేంజ్ రోవర్ అసెంబ్లింగ్
18 శాతం తక్కువ ధరకే మార్కెట్లోకి
న్యూఢిల్లీ, మే 24: టాటా గ్రూప్ బ్రిటన్ లగ్జరీ కార్ల బ్రాండ్ జాగ్వర్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) తన ఫ్లాగ్‌షిప్ రేంజ్ రోవర్ మోడల్‌ను, రేంజ్ రోవర్ స్పోర్ట్‌ను ఇండియాలోనే అసెంబుల్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దేశంలో లగ్జరీ కార్లకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇతర జేఎల్‌ఆర్ మోడల్స్ రేంజ్ రోవర్ వెలార్, రేంజ్ రోవర్ ఎవొక్యూ, జాగ్వర్ ఎఫ్‌ఛా డిస్కవరీ స్పోర్ట్‌లను టాటా మోటార్స్ పూనే ప్లాంటులో ఇప్పటికే అసెంబుల్ చేస్తున్నారు. ఇప్పటివరకూ యూకే వెలుపల రేంజ్ రోవర్ మోడల్‌ను ఉత్పత్తి చేయలేదు. స్థానికంగా అసెంబుల్ చేయడంతో ఈ మోడల్ ధర 18 శాతం తగ్గుతుందని, మోడల్‌ను బట్టి రూ.1.40 కోట్ల మధ్య ధరలు ఉంటాయని అంటున్నారు. దీంతో లగ్జరీ కార్ల మార్కెట్ పోటీలో ముందు ఉండవచ్చని కంపెనీ భావిస్తున్నది. జేఎల్‌ఆర్ స్టేపుల్ నుంచి కనీసం ఆరడజను కొత్త మోడల్స్‌ను, ఐసీఈ, ఈవీ రెండు విభాగాల్లోనూ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు సంబంధిత వర్గాలు వివరించాయి.






