01-09-2025 12:45:54 AM
-ఆరోగ్య పరంగా ఎన్నో లాభాలు
-చికెన్ ధరకు పోటీ పడుతూ మార్కెట్‌లో బలే డిమాండ్
-ఎన్నో పోషక ఉన్నాయంటున్న శాస్త్రవేత్తలు
ఆదిలాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి) : అడవులకు నెలవైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అడవుల్లో ప్రకృతి సిద్దంగా ఎన్నో రకాల పండ్లు, కూరగాయలు విరివిగా లభిస్తాయి. ఎన్నో పోషకాలు కలిగి ఉన్న వీటిని కొందరు అటవీ ప్రాంతం నుండి సేకరించి తీసుకువచ్చి విక్రయిస్తూ ఉపాధిని పొందుతున్నారు. ముఖ్యంగా జూలై, ఆగస్టు మాసా ల్లో ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో విరివిగా లభించే కూరగాయల్లో ముఖ్యమైంది బోడ కాకర కాయ.
దీన్నే అడవి కాకర కాయ అని, ఆకాకర కాయ అని ఇలా రకరకాల పేర్లతో ఈ ప్రాంతంలో వీటిని పిలుచుకుంటారు. వీటికి ఆదిలాబాద్ జిల్లాలో మంచి డిమాం డ్ ఉంది. కిలో బోడకాకర కాయలు రూ. 200 నుండి 300 రూపాయల వరకు ధర పలుకుతున్నాయి. పిల్లలు మొదలుకొని పెద్ద ల వరకు ఎంతో ఇష్టంగా తినే శుద్ద శాఖాహారం ఈ బోడ కాకరకాయ. పోషకాలు, ప్రోటీన్లే కాకుండా ఈ బోడ కాకర కాయలు ఆయుర్వేద గుణాలను కూడా కలిగి ఉన్నా యి. అందరికి ఆరోగ్యాన్ని పంచుతున్న శుద్ద శాఖాహారం ఈ బోడ కాకర కాయను రుచి చూడాలంటే ఈ సీజన్‌లో ఒక్కసారి ఆదిలాబాద్‌కు పోయిరావాల్సిందే.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అడవుల్లో విరివిరిగా లభించే ఈ బోడ కాకర కాయలను అమ్ముకుంటు ఉపాధి పొందుతారు. అడవుల్లో అడవుల్లో లభించే బోడ కాకరకాయను కొంతమంది పట్టణాలకు తీసుకువచ్చి విక్రయించి తద్వారా వచ్చే ఆదాయంతో జీవనోపాధిని పొందుతున్నారు. వర్షాకాలంలోనే లభించే బోడ కాకర కాయ లను రైతు బజార్లు, ప్రధాన వాణిజ్య కూడ ళ్ళు, ప్రధాన రహదారుల వెంట విక్రయిస్తున్నారు. ఈ అడవి కాకరకాయ వల్ల ఆరోగ్య పరంగా ఎన్నో లాభాలు ఉండటంతో పట్టణ వాసులు వీటిని ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు.
చికెన్ ధరతో పోటీ..
బోడ కాకరకాయకు మార్కెట్‌లో బలే డిమాండ్ ఉండటంతో వీటి కిలో ధర చికెన్ ధరలతో పోటీ పడుతోంది. కిలో బోడ కాకరకాయ 2 వందలు, ఆపైనే ధర పలుకుతోం ది. అయినా ఆరోగ్య పరంగా ఎన్నో లాభా లు ఉండటంతో ప్రజలు వీటిని ఇష్టపడుతున్నారు. పైగా ఏ రసాయన మందులు లేకుం డా సహజ సిద్దంగా అడవుల్లోని చెట్లకు కాస్తున్న ఈ బోడ కాకర అంటే అందరు ఆసక్తి చూపుతున్నారు.
వీటిని సేకరించాలంటే..
అడవుల్లో విరివిగా లభించే ఈ బోడ కాకర కాయలను ఏరుకొచ్చెందుకు గ్రామీణ ప్రాంత ప్రజలు ఉదయమే అడవుల్లోకి వెళుతున్నారు. చెట్లు, పొదలను అల్లుకొని ఉన్న తీగలకు కాచిన ఈ బోడ కాకర కాయలను తెంపుకొని వచ్చి పట్టణాల్లొ రోడ్ల పక్కన కుప్పలుగా పోసి విక్రయిస్తున్నారు. రాత్రి వరకు ఈ విక్రయాలు కొనసాగుతున్నాయి.
అయితే వీటిని సేకరించేందుకు వెళ్ళే సమయంలో ఒక్కో సారి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వీటిని సేకరించి తీసుకువచ్చి విక్రయిస్తున్న కొంతమంది గిరిజనులు పేర్కొంటున్నారు. ఒక్కోసారి పురుగు, పుట్ర, పాములు, తేళ్ళు వంటి విష కీటకాల కాటు కు గురికావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ బోడ కాకర ధర బాగానే ఉందని, తమకు రోజువారి కూలి పడుతోందని చెబుతున్నారు. నిత్యం వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో ఈ బోడకాకర కాయలను ఆదిలాబాద్ కు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు.
పోషకాలుతో కూడిన కూరగాయ...
ఆరోగ్య పరంగా, వాణిజ్య పరంగానూ మంచి లాభాలను ఇస్తున్న ఈ బోడ కాకర కాయల సాగువైపు రైతులు అడుగులు వేస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. సాధారణంగా ఈ బోడ కాకరకాయలు అటవీ ప్రాంతంలో ప్రకృతి సిద్దంగా సహజ వనరుల తోడ్పాటుతో విరివిగా లభిస్తున్నాయని, రైతులు ముందుకు వచ్చి వీటిని సాగు చేస్తే లాభదాయకంగా ఉంటుంది. మార్కెట్‌లో ఈ పంటకు ఎప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది, ఎన్నో పోషకాలు, మరెన్నో ప్రోటీన్లు కలిగి ఉన్న ఈ బోడ కాకర కాయలు ఆయుర్వేద గుణాలను కూడా కలిగి ఉన్నాయి.
డా. సునీల్‌కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, వ్యవసాయ కళాశాల