31-07-2025 12:17:52 AM
యాదాద్రి భువనగిరి జులై 30 ( విజయ క్రాంతి ): ప్రతి పేదవారికి రేషన్ కార్డు ద్వారానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని తదనుగుణంగా ప్రభుత్వం గొప్ప ఆలోచనతో నూతన రేషన్ కార్డులు ప్రారంభించడం జరిగిందని ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య అన్నారు. బుధవారం రోజు గుండాల మండల కేంద్రంలో అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు ప్రభుత్వ విప్ ,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య , యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో కలసి లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ , ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ... ప్రజా పాలనలో భాగంగా అర్హులైన లబ్దిదారులకు 6 కిలోల చొప్పున తెల్ల రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం ప్రజా ప్రభుత్వం చేపట్టిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకానికి తెల్ల రేషన్ కార్డు అవసరమని ఆలోచించి ,ప్రతి పేదవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా నూతన రేషన్ కార్డులు పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.
పేదవారి సొంతింటికల నెరవేర్చేందుకు అర్హులైన ప్రతి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందన్నారు. లబ్ధిదారులు ఇల్లు కట్టుకునేందుకు జిల్లా యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలో ఎంతో కృషి చేస్తున్నారని, లబ్ధిదారుల దగ్గర డబ్బులు లేకపోతే మహిళా సంఘాల ద్వారా లోన్లు ఇప్పించి ఇంటి నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ..రేషన్ కార్డ్ తీసుకోవడం పేదల కల అని గత 10 సంవత్సరాల నుండి ఎదురుచూసిన వారి కల నెరవేరిందన్నారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.