05-07-2025 09:02:17 PM
కరీంనగర్ (విజయక్రాంతి): సమాజాన్ని చదివిన గొప్ప కవి రావూరి భరద్వాజ అని కరీంనగర్ ఫిలిం సొసైటీ(Karimnagar Film Society) అధ్యక్షులు డా. పొన్నం రవిచంద్ర అన్నారు. ఎనిమిదవ తరగతి చదువు మధ్యలో ఆపేసిన భరద్వాజ, గ్రంధాలయంలో పుస్తకాలు చదివి జ్ఞానాన్ని సంపాదించి గొప్ప రచయితగా ఎదగడం అసాధారణ విషయమని రవిచంద్ర పేర్కొన్నారు. డాక్టర్ రావూరి భరద్వాజ జయంతి సందర్భంగా ఈ రోజు ఫిలిం భవన్ లో తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ, కరీంనగర్ ఫిలిం సొసైటీ, తెలంగాణ రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రముఖ కవి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎర్రోజు వెంకటేశ్వర్లు ప్రధాన ప్రసంగం చేస్తూ తెలుగు రచనా ప్రపంచంలో వినూత్న సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనుడు రావూరి భరద్వాజ కేవలం 8వ తరగతి వరకే చదువుకున్న రావూరిపై చలం ప్రభావం ఎక్కువగా ఉండేదని అన్నారు.
రావూరి భరద్వాజ… భారత దేశపు అత్యున్నత సాహితీ పురస్కారం జ్ఞానపీఠ అవార్డు అందుకున్న మూడవ తెలుగు సాహిత్య దిగ్గజమని పేర్కొన్నారు. ఆయన తన జీవన గమనంలో సుమారు 187 పైగా పుస్తకాలను, 500 పైగా కథలను 37 కథా సంపుటాలుగా, 17 నవలలు, 6 బాలల మినీ నవలలు, 5 బాలల కథా సంపుటాలు, 3 వ్యాస, ఆత్మకథా సంపుటాలు, 8 నాటికలు, ఐదు రేడియో కథానికలు రచించారని చెప్పారు. ఈ సందర్భంగా మామిడి హరికృష్ణ దర్శకత్వంలో పొన్నం రవిచంద్ర, ఐనంపూడి శ్రీలక్ష్మి నిర్మించిన ఏకాంతవాసి లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. సదాశ్రీ స్వాగోతోపాన్యాసం చేసిన ఈ కార్యక్రమంలో కె. లక్ష్మి గౌతమ్ వందన సమర్పణ చేయాగా, సయ్యద్ ముజఫర్, చెన్న అనిల్ కుమార్, అన్నవరం దేవేందర్, గాజోజు నాగభూషణం, కందుకూరి అంజయ్య, తంగెడ అశోక్ రావు, సురేష్ దామెరకుంట శంకరయ్య, శ్రీమతి తోట నిర్మల, పి.ఎస్. రవీంద్ర, గజేందర్ రెడ్డి, వైరాగ్యం ప్రభాకర్, జితేందర్, కాసు మహేందర్ రాజు, తదితరులు పాల్గొన్నారు.