05-07-2025 09:03:36 PM
రామకృష్ణాపూర్,(విజయక్రాంతి): వైద్య అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రామకృష్ణాపూర్ పట్టణంలో ప్రవేట్ క్లినిక్ లు ఇష్టారీతిన వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని జిల్లా సీపీఐ నాయకులు ఆరోపించారు. శనివారం సీపీఐ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాడారు. పట్టణంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా క్లినిక్ లు నడుపుతున్న ఆర్ఎంపి, పిఎంపిలపై సంబంధిత అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక భగత్ సింగ్ నగర్ కు చెందిన ఆర్ఎంపీ వైద్యం వికటించడం శుక్రవారం గొల్లపల్లి శ్రీనాథ చారి మరణించగా ఆ యువకుడి కుటుంబ సభ్యులు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. త్వరలో ఆర్ఎంపీ పై తను నిర్వహిస్తున్న మెడికల్ షాప్ పై తెలంగాణ మెడికల్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. మృతుని కుటుంబ సభ్యులకు అండగా ఉన్న కొందరు స్థానిక నాయకులు పంచాయతీలు చేయడం దురదృష్టకరమని రామడుగు లక్ష్మణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి మిట్టపెల్లి శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఇప్పకాయల లింగయ్య, జిల్లాసమితి సభ్యులు నక్క వెంకటస్వామి, కాదండి సాంబయ్య, మిట్టపెల్లి ఫౌల్, మామిడి గోపి తదితరులు పాల్గొన్నారు.
ప్రాణం ఖరీదు రూ. 5 లక్షలు...
ఒక పక్క మరణించిన గొల్లపల్లి శ్రీనాద్ కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో ఉంటే బాధితుల పక్షాన ఉన్న కొందరు నాయకులు ఆర్.ఎం.పీతో పంచాయతీ చేసి తనపై కేసు కాకుండా చూసుకుంటామని బాధితుని కుటుంబ సభ్యులకు రూ. రెండు లక్షలు ఇప్పించి, నాయకులు మూడు లక్షలు దండుకున్నట్లు సోషల్ మీడియాలో రావడంతో కొందరు బహిరంగంగా ప్రాణం ఖరీదు కేవలం రూ. 5 లక్షలేనా అంటూ చర్చించుకుంటున్నారు. చాలా ఫర్వార్డ్ చేయడంతో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతుంది.