16-05-2025 09:55:08 PM
మందమర్రి,(విజయక్రాంతి): సింగరేణి ఉత్పత్తిలో రక్షణకు ఎంతో శ్రమించి, సమయా భావం లేకుండా పని చేస్తున్న అధికారులకు క్రమం తప్పకుండా రావాల్సిన పిఆర్పిని ఇవ్వకపోవడంతో అధికారులందరూ తదుపరి కార్యాచరణకు సిద్ధం కావాలని సీఎంఓఏఐ సింగరేణి బ్రాంచ్ కార్యదర్శి పి నరసింహులు, ఉపాధ్యక్షుడు పి శ్రీనివాస్, రామగుండం 1 ఏరియా ఉపాధ్యక్షుడు పి శ్రీనివాస్ లు పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలో సిఎంఓఏఐ ఏరియా అధ్యక్షుడు రమేష్, బెల్లంపల్లి ఏరియా అధ్యక్షుడు ఎం నరేందర్ ల ఆధ్వర్యంలో సిఎంఓఏఐ అత్యవసర సమావేశం నిర్వహించగా, ఈ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో 2022-23 పిఆర్పి గురించి చర్చించి, చాలా కాలం నుండి పెండింగ్లో ఉన్న పిఆర్పి ఇప్పటికి ప్రభుత్వం నుండి అనుమతి రాకపోవడంలో జరుగుతున్న జాప్యంతో అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నరసింహులు, శ్రీనివాస్ లు మాట్లాడుతూ... పిఆర్పి అమలుపై జరుగుతున్న జాప్యంతో అధికారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అసలు పిఆర్పి ఇస్తారా, ఇవ్వరా, అనే సందిగ్ధంలో అధికారులు ఉన్నారన్నారు. పిఆర్పి అనేది అధికారుల జీవితంలో భాగమైన, దీన్ని ఇంతవరకు ఇవ్వకపోవడం సరైనది కాదని తెలిపారు. సింగరేణి అధికారులకు రావాల్సిన పిఆర్పి గురించి ఇదివరకే దాదాపు 24 సార్లు సంబంధిత అధికారులను కలిసిన, చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి అసెంబ్లీ సమావేశంలో సైతం పిఆర్పి విషయం గురించి మాట్లాడిన, ఇప్పటికీ పిఆర్పి ప్రక్రియ ముందుకు పోవడం లేదని గుర్తు చేశారు. పిఆర్పి అమల్లో జరుగుతున్న జాప్యానికి అసహనం వ్యక్తం చేస్తూ, వివిధ కార్యాచరణలు చేపట్టాలని, దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని సమావేశాల్లో తీర్మానించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిఎంఓఏఐ ఏరియా ఉపాధ్యక్షుడు నాగవర్ధన్, జాయింట్ కార్యదర్శి ఆర్ నరేష్, రవి, సంతోష్, బెల్లంపల్లి ఏరియా కార్యదర్శి వీరన్న, సభ్యులు, సింగరేణి అధికారులు పాల్గొన్నారు.