07-09-2025 06:29:20 PM
తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా(Suryapet District) తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామంలో రామాలయం యువత ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పెట్టే లడ్డును వేలం వేయగా గ్రామంలోనే రికార్డు స్థాయిలో ధర పలికింది. ఇక్కడ ప్రతి సంవత్సరం రామాలయం యువత ఆధ్వర్యంలో స్వామివారిని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తుంటారు. పోటీలో ఉన్నది తక్కువ మంది అయినప్పటికీ పోటీ ఏమాత్రం తగ్గలేదు. పోటీలో ఉన్న కొద్దిమంది లడ్డు కోసం తీవ్రస్థాయిలో పోటీపడ్డారు. దీంతో చివరికి రూ.30,016 వేల రూపాయలకు పులు గుజ్జ యాకయ్య - యాకమ్మ దంపతులు ఈ లడ్డును సొంతం చేసుకున్నారు.
కాగా చిన్న లడ్డును శిగ వెంకన్న - పద్మ దంపతులు రూ.8516 రూపాయలతో కైవసం చేసుకోగా, స్వామివారికి కట్టిన పంచ కండువ ను రూ.4016 రూపాయలకు చంటి యాకయ్య - ఉమా దక్కించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ... పార్వతీ పుత్రుడి సన్నిధిలో పెట్టిన లడ్డు ప్రసాదాన్ని తీసుకోవడం ద్వారా అన్ని విధాలా కలిసి వస్తుందని నమ్మకంతో ఈ లడ్డును దక్కించుకున్నట్లు తెలిపారు. అనంతరం భక్తులు, యువతీ యువకుల ఆటపాటల కోలాహలం మధ్య శోభాయాత్ర ను ఘనంగా నిర్వహించి గ్రామంలోని పెద్ద చెరువులో నిమజ్జనం చేశారు. ఈ వేడుకల్లో రామాలయం యువత అధ్యక్షుడు కొండ కమలాకర్, ఉపాధ్యక్షులు భాష బోయిన సోమన్న, కార్యదర్శి పాలవెల్లి గణేష్, ఇతర కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.