07-09-2025 12:20:14 AM
-రంగారెడ్డి జిల్లా రిచ్‌మండ్ విల్లాలో అత్యధికంగా రూ.2.31 కోట్లు
-రూ.35 లక్షలకు బాలాపూర్ లడ్డూ వేలం
-సంగారెడ్డిలో 18 లక్షలకు దక్కించుకున్న జగ్గారెడ్డి కూతూరు
విజయక్రాంతి న్యూస్ నెట్‌వర్క్, సెప్టెంబర్ 6: భక్తికి సేవ తోడైతే ఆ ఫలం ఎంత మధురంగా ఉంటుందో చెప్పడానికి ఈ లడ్డూ వేలమే నిదర్శనం. నవరాత్రులు గణపతి వద్ద విశేష పూజలందుకున్న లడ్డూను మహిమాన్వితంగా భావిస్తూ భక్తులు అధిక మొత్తంలో వేలంపాడి దక్కించుకున్నారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రిచ్‌మండ్ విల్లాలో శుక్రవారం రాత్రి రూ. 2.31 కోట్ల రికార్డు వేలం దక్కింది. ఈ వేలం వెనుక ఉన్న ఓ ఆశయం ఉంది.
ఏటా ఇక్కడ జరిగే లడ్డూ వేలం పాట ఎంతో ప్రత్యేకం. ఇది కేవలం లడ్డూను దక్కించుకోవడానికి జరిగే పోటీ కాదు, ఒక సామూహిక సేవా యజ్ఞం. ఇక్కడి ‘అర్విదియా’ అనే చారిటబుల్ ట్రస్టు సభ్యులే నాలుగు బృందాలు గా ఏర్పడి పోటీపడతారు. హోరాహోరీగా సాగి న ఈ వేలంలో చివరికి ఒక బృందం లడ్డూ ను కైవసం చేసుకుంది. అయితే ఇక్కడి అస లు విశేషం అప్పుడే మొదలవుతుంది.
గెలిచిన బృందం పాడిన మొత్తంతో పాటు, పోటీలో పాల్గొన్న మిగిలిన బృందాలు పాడి న డబ్బును కూడా కలిపి మొత్తం ట్రస్టుకే జమ చేస్తారు. ఈ వినూత్న సంప్రదాయం వల్లే వేలంలో పలికే ప్రతి రూపాయి సమాజ సేవకే దక్కుతుంది. గతేడాది ఇక్కడ లడ్డూ రూ. 1.87 కోట్లు పలకగా, ఈసారి ఆ రికార్డును బద్దలు కొడుతూ దాదాపు రూ. 44 లక్షలు అధికంగా పలకడం విశేషం. ఇలా సేకరించిన నిధులను ‘అర్వి దియా’ ట్రస్టు ద్వా రా ఏడాది పొడవునా విద్య, వైద్యం వంటి అనేక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారు.
బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం రూ.35 లక్షలు
భాగ్యనగరంలో బాలాపూర్ వినాయకుడు లడ్డూకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈసారి రూ.35 లక్షల ధర పలికింది. కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథగౌడ్ ఈ లడ్డూ ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు. గతేడాది బాలాపూర్ లడ్డూను రూ.30.01 లక్షలకు బాలాపూర్‌కు చెందిన బీజేపీ రాష్ర్ట నాయకుడు కొలన్ శంకర్‌రెడ్డి దక్కించుకున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది లడ్డూ రూ.4.99లక్షలకు అధిక ధర పలికింది. గత ఆరేళ్లుగా బాలాపూర్ లడ్డూను దక్కించుకోవాలని చూస్తున్నానని.. స్వామివారు ఇప్పు డు కరుణించారని లింగాల దశరథ గౌడ్ పేర్కొన్నారు.
వేలం పాటలో పాల్గొన్నజగ్గారెడ్డి కూతురు
సంగారెడ్డి పట్టణంలో శ్రీ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూతురు జయ గణచైతన్యరెడ్డి రూ.18 లక్షలకు వేలంపాటలో దక్కించుకున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని బీఎస్‌ఆర్ కాలనీలో గణపతి లడ్డును బీఎస్‌ఆర్ కాలనీ రోడ్ నెంబర్ 7లో నివాసం ఉండే సుధాకర్ రూ.2 లక్షలకు దక్కించుకున్నారు. పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామంలో గణేష్ గడ్డలో స్వయంభుగా వెలసిన సిద్ధి వినాయక ఆలయంలో శనివారం మూడు లడ్డూలను వేలంపాట వేశారు.
మొదటి లడ్డును తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదుల నాగులపల్లి గ్రామానికి చెందిన యువ నాయకుడు సాయి చరణ్‌గౌడ్ రూ.7 లక్షలకు దక్షించుకున్నారు. రెండవ లడ్డును రామచంద్రాపురం పట్టణానికి చెందిన వరుణ్ రూ.3 లక్షల 40 వేలకు దక్కించుకున్నారు. మూడవ లడ్డు రుద్రారం గ్రామానికి చెందిన పట్నం రామారావు రూ.2 లక్షల 50 వేలకు దక్కించుకున్నారు. సూర్యాపేట జిల్లాలోని కోదాడ పట్టణంలో కాన్వాసింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం గణేష్ లడ్డూ వేలంపాట హోరాహోరిగా సాగింది. లడ్డూను శ్రీ లక్ష్మీ సాయి లారీ సప్లై ఆఫీస్ వారు చింతల వీరయ్య బృందం సభ్యులు రూ.3.51 లక్షలకు దక్కించుకున్నారు.
హైదరాబాద్ నగరంలో..
మల్కాజిగిరి ఈస్ట్ ఆనంద్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంపాటలో తోరణాల సంజయ్‌కుమార్‌గుప్తా రూ.3.5 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. ముషీరాబాద్‌లో శక్తియూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంలో కూకట్‌పల్లికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగరాజు రూ.71 వేలకు లడ్డూను దక్కించుకున్నారు. భోలక్ పూర్ హౌస్ వద్ద శ్రీ సిద్ది వినాయక భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన గణనాథుని లడ్డూను స్థానిక వ్యాపారి బీఆర్‌ఎస్ నాయకుడు నవీన్‌కుమార్ రూ.6.30లక్షలకు దక్కించుకున్నారు.