25 April, 2026 | 11:43 AM

మెరిసే చిరునవ్వు కోసం!

06-03-2025 12:00 AM

నేడు జాతీయ దంత వైద్యుల దినోత్సవం

దంతవైద్యంలో సాంకేతిక పరిజ్ఞానం వే గంగా అభివృద్ధి చెందు తూ, చికిత్సను మరింత సులభతరం చేస్తున్నది. త్రీడీ ప్రింటింగ్, కంప్యూటర్- ఏడెడ్ డిజైన్ (సీఏ డీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి ఆధునిక సాంకేతికతలు వైద్యులను మరింత ఖచ్చితత్వంతో చికిత్స అందించే లా సాయపడుతున్నాయి. టెలీడెంటిస్ట్రీ ద్వారా, రోగులు దూరస్థంగా దంతవైద్యులను సంప్రదించి అవసరమైన మార్గదర్శ నం పొందగలుగుతున్నారు. ఇక, డిజిటల్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ ప్లానింగ్ ద్వారా ఇంప్లాంట్లను శస్త్రచికిత్సకు ముందే ఖచ్చితంగా మ్యాప్ చేయడం వల్ల శస్త్రచికిత్స సులభతరం అవుతున్నది. గమ్ చికిత్సల్లో లేజర్ టెక్నాలజీ విప్లవాత్మక మార్పులు తెచ్చి నొప్పిని తగ్గించడంతోపాటు వేగంగా కోలుకునేలా చేస్తున్నది. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మరిన్ని వినూత్న మార్గాలను అందిస్తుంది. 

దంత సమస్యలను ముందుగానే గుర్తించి, చికిత్స ప్రణాళికలను రూపొందించడానికి సాంకేతికతలన్నీ సహాయపడ తాయి. నానోబాట్స్, బయోప్రింటింగ్‌ల అభివృద్ధి భవిష్యత్తులో దంత వైద్యంలో మరింత ముందంజ వేయనుంది. శాస్త్రవేత్తలు అతి సూక్ష్మ నానోబాట్స్ సాయంతో దంతాల పునరుద్ధరణ, హానికరమైన బ్యాక్టీరియాను ఎదుర్కోవడం, డయాబెటిస్ వంటి వ్యాధులను గుర్తింపు వంటి పరిశోధనలు చేస్తున్నారు.

త్రీడీ ప్రింటింగ్ సాంకేతికతతో కృత్రిమ దంతాలను రూపొందించడం, నోటి క్యాన్సర్ చికిత్సకు అవసరమైన బయోప్రింటెడ్ కండరాలు, గమ్ టిష్యూలను రోగుల స్వంత కణజాలంతో అభివృద్ధి చేయడం వంటి ప్రయోగాలు ముందుకు సాగుతున్నాయి. ఈ సాంకేతికతలతో దంతవైద్యం వేగవంతం, ఖర్చు తక్కువవుతూ, రోగులకు తక్కువ నొప్పితో చికిత్స అందించేలా అభివృద్ధి చెందుతున్నది. భవిష్యత్తులో బాధన్నదే లేకుండా ఆరోగ్యకరమైన చిరునవ్వు మరింత మందికి సులభంగా చేరువ కానుంది.

 డా. వేపకొమ్మ కృష్ణకుమార్