calender_icon.png 7 July, 2025 | 5:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జ్యుడీషియల్ విచారణకు నిరాకరణ

06-12-2024 02:41:22 AM

ఎన్‌కౌంటర్ పిటిషన్‌పై హైకోర్టు  

హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): ములు గు జిల్లా ఏటూరునాగారం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై జ్యుడిషియల్ విచారణకు హైకోర్టు నిరాకరిం చింది. పోస్టుమార్టం నివేదిక అందకుండానే జ్యుడిషియల్ విచారణ జరిపించాలని పిటిషనర్ కోరడాన్ని తప్పుపట్టింది. బంధువుల సమక్షంలో రెండోసారి విచారణ చేయడానికి కూడా అనుమతించలేమని తేల్చిచెప్పింది. ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మల్లయ్య మృతదేహాన్ని ఆయన బంధువులకు అప్పగించాలని ఉత్తర్వులు జారీచేసింది. మృతదేహాన్ని అప్పగించే ముందు ఫొటో, వీడియో తీసుకోవడానికి భార్యను, ఆమె తరపు న్యాయవాదిని అనుమతించాలని పోలీసులను ఆదేశించింది. 

ఎన్‌కౌంటర్ బూటకమని, దానిపై దర్యాప్తునకు ఆదేశాలివ్వాలంటూ మృతుడు మల్లయ్య భార్య కే ఐలమ్మ అలియాస్ మీనా దాఖలు చేసిన వ్యాజ్యాన్ని గురువారం జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి విచారించారు. ప్రభు త్వ న్యాయవాది మహేశ్‌రాజ్ వాదిస్తూ.. ఆరుగురి మృతదేహాలను బంధువులకు అప్పగించామని తెలిపారు. పిటిషనర్ భర్త మల్లయ్య మృతదేహం ఒక్కటే ఉందని రాతపూర్వక వివరణను తెలియజేశారు. పోలీసులు తీసుకున్న చర్యలపై నివేదికను కూడా అందజేశారు.

వీటిని హైకోర్టు పరిశీలించింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా దీన్ని సుమోటోగా తీసుకున్నట్టు తెలిసిందని చెప్పింది. పిటిషనర్ ఆ కమిషన్ వద్దకు ఎందుకు వెళ్లరాదని వ్యాఖ్యానించింది. సమస్య ను జఠిలం చేయరాదని, ఏదో ఒక పరిష్కారం చూడాలని హితవు పలికింది. ఎంతకాలం మృతదేహాన్ని భద్రంచేయాలని ఆదేశించగలమని కూడా ప్రశ్నించింది.  పిటిషనర్ తరపు న్యాయవాది సురేశ్‌కుమార్ వాదిస్తూ.. కేసు నమోదు గురించి కూడా పిటిషనర్‌కు తెలియదని చెప్పారు.

ఏయే సెక్షన్ల కింద కేసు నమోదు చేశారో కూడా తెలియదన్నారు. పోస్టుమార్టం ప్రాథమిక నివేదికను ఇవ్వకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. మల్లయ్య మృతదేహం ఫొటోలను చూస్తే.. శరీరంపై ఎలాంటి గాయాలు ఉన్నాయో తెలుస్తుందని చెప్పారు. బుల్లెట్ గాయం ఒక్కటే ఉందని, అయితే ఒంటిపై మరో 11 గాయాలు కూడా ఉన్నాయని చెప్పారు. మల్లయ్య దంతాలు రాలిపోయాయని, గాయాలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. చట్టప్రకారం మరోసారి విచారణ జరపాలని కోరుతున్నట్టు చెప్పారు.

జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలని కోరారు. గతంలోని హైకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ఆదేశాలు ఇవ్వబోమని న్యాయమూర్తి స్పష్టంచేశారు. తప్పుడు సంకేతాలకు తావివ్వొద్దని కోరారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పోస్టుమార్టం జరిగిందన్నారు. 9 మంది వైద్య నిపుణులు పోస్టుమార్టం చేశారన్నారు. ప్రభుత్వ న్యాయ వాది మహేశ్ రాజ్ జోక్యం చేసుకుంటూ.. ఊహాజనిత అంశాలు, ఆరోపణలను పరిగణనలోకి తీసుకోరాదని అన్నారు దట్టమైన అడవిలో ఘటన జరిగిందన్నారు. బుల్లెట్ వల్ల వ్యక్తి కింద పడినపుడు గాయాలు అవుతాయన్నారు.

పిటిషనర్ భర్తను చూడటానికి, ఫొటోలు తీసుకోవడానికి అనుమతించలేదన్నారు. ఇరుపక్షాల వాదనల తర్వాత న్యాయమూర్తి.. మల్లయ్య మృతదేహాన్ని పిటిషనర్‌తోపాటు ఆమె న్యాయవాదిని చూసేందుకు అనుమతించాలని పోలీసులను ఆదేశించారు. డీఎస్పీ రవీందర్‌రెడ్డి సమక్షంలో ఆ ఇద్దరు మృతదేహాన్ని చూడవచ్చన్నారు. మృతదేహాన్ని సెల్‌ఫోన్ ద్వారా ఫొటో, వీడియో తీసుకోవడానికి అనుమతించాలని, ఆ తర్వాత మృతదేహాలను బంధువులకు అప్పగించాలని ఆదేశించారు. విచారణను ఈ నెల 26కు వాయిదా వేశారు.