calender_icon.png 24 November, 2025 | 5:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలి

10-02-2025 10:42:49 PM

అనుమతులు లేని అకాడమీలపై చర్యలు తీసుకోవాలి..

ఖమ్మం కేంద్రంగా ప్రభుత్వ జనరల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి..

విలేకరుల సమావేశంలో జార్జి రెడ్డి పిడిఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నాగేశ్వర రావు..  

ఖమ్మం (విజయక్రాంతి): పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ ను పూర్తి స్థాయిలో తక్షణమే విడుదల చేయాలనీ, ఖమ్మం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని జార్జిరెడ్డి పి. డి.ఎస్.యూ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్.ఎస్.నాగేశ్వర రావు డిమాండ్ చేశారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను చెల్లించని కారణంగా విద్యార్థులు, కళాశాల యాజమాన్యాల తీవ్ర మానసిక వేదనకు గురి అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా విద్యా రంగ సమస్యలు పరిష్కారానికి చొరవ తీసుకోకపోవడం విస్మయాన్ని కలిగిస్తుందని అన్నారు. విద్యా కమిషన్ లు, ఇతర కమిటీలు శోకేజులు మాదిరిగా మారాయని ఎద్దేవా చేశారు. గత ఆరునెలల కాలంలో డిగ్రీ కళాశాలలు బంద్ నిర్వహించాయని, మళ్ళీ నిర్వహిస్తామని అంటున్నారని గుర్తు చేశారు.

తక్షణమే ప్రభుత్వం వారితో చర్చలు జరిపి వారి సమస్యను పరిష్కరించి, విద్యార్థులకు న్యాయం చేయాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా ప్రజల చిరకాల వాంఛగా మారిన ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటుపై ప్రకటన చేయాలని కోరారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ యూనివర్సిటీ ఏర్పాటుకు జిల్లా మంత్రులు బాధ్యత తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాలలో జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ముఖ్యమంత్రితో స్పష్టమైన ప్రకటన చెప్పించాలని విజ్ఞప్తి చేశారు. 

ఖమ్మం జిల్లాలో అనుమతులు లేకుండా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న విద్యా సంస్థలపై, కోచింగ్ సెంటర్, అకాడమీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉన్నత అధికారులు పారదర్శకంగా తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పై అంశాలపై జార్జిరెడ్డి పిడిఎస్యు దశల వారీగా పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో పిడిఎస్ యు జిల్లా అధ్యక్షులు మందా సురేష్, సహాయ కార్యదర్శి సి.ఎచ్.అజయ్, నాయకులు శ్యామల, కైఫ్, ఇందు, శ్రావణి, అనిత, నాగరాజు, రాజేష్, గోపి, వినయ్ తదితరులు పాల్గొన్నారు.