24-11-2025 05:10:45 PM
జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్..
గద్వాల: తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ మండలిలో అర్హులైన కార్మికులందరూ తమ పేర్లను నమోదు చేసుకుని, బీమా సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు. సంక్షేమ మండలి బీమా పెంపు అవగాహన సదస్సు కార్యక్రమంకు సంబంధించిన కరపత్రాలు, గోడపత్రికలను సోమవారం కలెక్టర్ చాంబర్లో సంబంధిత అధికారులతో కలిసి విడుదల చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో సహజ మరణం పొందిన కార్మికులకు రూ. లక్ష బీమా అందుతుండగా, ప్రస్తుతం రూ.2 లక్షల బీమా డబ్బులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రమాదవశాత్తు మరణించే వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలకు బీమా పెంచడం జరిగిందన్నారు. సహజ మరణానికి సంబంధించి లేబర్ గుర్తింపు కార్డు, ఆధార్ ఒరిజినల్ కార్డు, మరణ ధ్రువీకరణ పత్రం, నామిని ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం కాపీ, ప్రమాద మరణానికి సంబంధించి అదనంగా ఎఫ్ఐఆర్ కాపీ, పోస్టుమార్టం రిపోర్టును మీ–సేవ ద్వారా దరఖాస్తు చేసుకుని, లబ్ధి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్మిక అధికారి వేణుగోపాల్, అబ్రహం పాల్గొన్నారు.