calender_icon.png 21 November, 2025 | 4:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం

21-11-2025 03:07:06 PM

కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నాం 

సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

ఎల్ ఎం డి జలాశయంలో చేప పిల్లల విడుదల 

కరీంనగర్, నవంబర్21(విజయక్రాంతి): అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి  ప్రభుత్వ లక్ష్యమని, ఇందు కోసం నిరంతరం కృషి చేస్తున్నామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో లోయర్ మానేరు జలాశయంలో 100% రాయితీతో ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో పాటు సుడా చైర్మన్ కోమటిరెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై జలాశయంలో చేప పిల్లలు విడుదల చేశారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రూ. 2 కోట్ల 18 లక్షల వ్యయంతో 2 కోట్ల 20 లక్షల చేప పిల్లలను చెరువులు, కుంటలు జలాశయాల్లో విడుదల చేస్తున్నామని అన్నారు. 80 నుండి 100 ఎంఎం సైజు గల ఈ చేప పిల్లలను విడుదల చేయడం ద్వారా సుమారు 2500 మంది మత్స్యకారులు ప్రత్యక్షంగా, 1300 మంది పరోక్షంగా జీవనోపాధి పొందుతారని తెలిపారు.

ఎల్ఎండిలో 30 లక్షల చేపలను విడుదల చేస్తున్నామని అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం కుల వృత్తులను ఆదరిస్తూనే ఉందని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో మత్స్యశాఖ కాంట్రాక్టర్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేసేలా కృషి చేస్తామని అన్నారు. మత్స్యకారుల సొసైటీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా ప్రయత్నిస్తామని తెలిపారు. అనంతరం ప్రమాదవశాత్తు మరణించిన మత్స్య కార్మికుని కుటుంబానికి రూ. 5 లక్షల బీమా చెక్కును అందజేశారు. జిల్లాలో మొట్టమొదటగా మహిళా మత్స్యకార్మిక సహకార సంఘం ఏర్పాటు చేసినందున వారికి రిజిస్ట్రేషన్ పత్రాన్ని అందజేశారు. మత్స్య కార్మిక సంఘంలో సభ్యత్వం తీసుకున్న వారికి సభ్యత్వ నమోదు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య కార్మిక సంఘం చైర్మన్ పిట్టల రవీందర్, ఆర్టిఏ మెంబర్ పడాల రాహుల్, మత్స్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విజయభారతి, మత్స్య కార్మిక సహకార సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.