21-11-2025 03:08:35 PM
మంచిర్యాల, (విజయక్రాంతి) : జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) జిల్లా అధ్యక్షుడు తొట్ల మల్లేష్ కోరారు. శుక్ర వారం కలెక్టరేట్ కార్యాలయ ఏవో రాజేశ్వర్ కు వినతిపత్రం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి టీ డబ్ల్యూ జే ఎఫ్ దీర్ఘకాలికంగా పనిచేస్తున్నదనీ, పాత్రికేయుల అభివృద్ధి, సంక్షేమమే ఏజెండాగా కృషి చేస్తుందన్నారు. వేలాది మంది సభ్యత్వం కలిగిన ఫెడరేషన్, సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న ఇండ్ల స్థలాలు, అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, రిటైర్డ్ జర్నలిస్టులకు పింఛన్లు, మహిళా జర్నలిస్టులకు రాత్రి పూట రవాణా సౌకర్యం తదితర సమస్యలపై ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నదన్నారు. ఇండ్ల స్థలాల సమస్య ఏండ్ల తరబడి పెండింగ్ లో ఉందనీ, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ లోని వేయి మంది జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను కేటాయించగా సుప్రీంకోర్టు తీర్పుతో సమస్య మళ్ళీ మొదటికొచ్చిందన్నారు.
ఈ నేపథ్యంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం కొత్త విధానం తీసుకురావాల్సిన అవసరం ఉందనీ, హైదరాబాద్ తో పాటు మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నివాస సౌకర్యం లేక అనేక ఇబ్బందులు, కష్టాలు పడుతున్నారన్నారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇచ్చి సమస్య శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు. మరో వైపు అక్రిడిటెషన్లు ఏడాదిన్నర కాలంగా స్టిక్కర్లతో నడుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 వేల అక్రిడిటేషన్ కార్డులున్నాయనీ, పర్మినెంట్ కార్డులు లేకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాలు, కార్యక్రమాల్లో విధుల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీలు వెంటనే ఏర్పాటు చేసి కొత్త కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేశారు.
హెల్త్ కార్డులు ఎందుకూ పనికిరావడం లేదనీ, రాష్ట్రంలో దాదాపు 40 వేల హెల్త్ కార్డులు ఉన్నా వీటిని కార్పొరేట్, ప్రయివేటు ఆసుపత్రులు గౌరవించడం లేదన్నారు. హైదరాబాద్ లోని నీమ్స్ లో మాత్రమే పాక్షికంగా పనిచేస్తున్నాయనీ, ఇతర ఏ ఆసుపత్రులూ వీటితో చికిత్సను అందించడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు కొత్త విధానం తేచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నదనీ, అదే విధానాన్ని జర్నలిస్టులకూ వర్తింపజేసి కంట్రీబ్యూషన్ మాత్రం ప్రభుత్వమే భరించాలనీ కోరారు. కార్మిక శాఖ పరిధిలో ఉన్న త్రైపాక్షిక కమిటీలను ప్రకటించి, సమావేశాలు ఏర్పాటు చేసి కలం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తోట్ల మల్లేష్ యాదవ్, చింతకింది మధుసూదన్, జాతీయ కౌన్సిల్ సభ్యులు ముత్యం వెంకటస్వామి, కోశాధికారి క్యాతమ్ రాజేష్, ఉపాధ్యక్షులు అరికెళ్ల జీవన్ బాబు, తలారి సమ్మయ్య, నాయకులు ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.