calender_icon.png 8 November, 2025 | 11:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవానికి మిగిలి ఉన్న పనులు పూర్తిచేయాలి

08-11-2025 12:00:00 AM

గద్వాల, నవంబర్ 7 : గద్వాలలో రూ.30 కోట్ల నిధుల అంచనాతో నిర్మించిన నర్సింగ్ కళాశాల భవన ప్రారంభోత్సవానికి మిగిలి ఉన్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు. శుక్రవారం పట్టణ శివారులోని పరమాల గ్రామం వద్ద నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాల, క్రిటికల్ కేర్ యూనిట్ భవన నిర్మాణ పనులను సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నర్సింగ్ కళాశాల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. 

భవనం ప్రారంభించుకున్నాక ఎలాంటి సమస్యలు లేకుండా అవసరమైన ఇతర పనులు ఏమైనా ఉంటే ఇప్పుడే ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అంతర్గత రహదారులు, నీటి వసతి, ఫర్నిచర్, ఇతర సౌకర్యాలు పూర్తిస్థాయిలో కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. అనంతరం క్రిటికల్ కేర్ యూనిట్ భవన నిర్మాణ పనులను వివిధ బ్లాక్ లలో తిరుగుతూ క్షుణ్ణంగా పరిశీలించారు.  గద్వాలలో రూ. 130 కోట్ల నిధుల అంచనాతో  నిర్మించనున్న మెడికల్ కళాశాలకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.

ఈ పర్యటనలో మిషన్ భగీరథ  ఈఈ శ్రీధర్ రెడ్డి, టీజీఎంఎస్‌ఐడిసి (తెలంగాణ గవర్నమెంట్ మెడికల్ సర్వీస్ ఇన్ఫాస్ట్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వేణుగోపాల్, ఏఈ ఎండి రహీం, ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ ఇందిర, మెడికల్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ నాగేశ్వర రావు, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ హనుమంతమ్మ, తదితరులు పాల్గొన్నారు.