calender_icon.png 26 January, 2026 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా గణతంత్ర దినోత్సవం

26-01-2026 09:20:51 PM

మువ్వన్నెల రెపరెపలతో మురిసిన మండలం

బెజ్జూర్,(విజయక్రాంతి): మండల వ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం అత్యంత వైభవంగా జరిగాయి. మండల కేంద్రంతో పాటు గ్రామగ్రామాన మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఈ సందర్భంగా మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ పండుగను ఘనంగా నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రామ్మోహన్ రావు, మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, మండల విద్యాధికారి కార్యాలయంలో ఎంఈఓ డాక్టర్ సునీత, రక్షక భట నిలయంలో ఎస్సై సర్తాజ్ పాషా, మండల వ్యవసాయ అధికారి కార్యాలయ ప్రాంగణంలో ఏవో నాగరాజు, కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ప్రిన్సిపల్ అరుణ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంచార్జ్ ప్రిన్సిపల్ సపన్ మండల్ కుమార్, ప్రభుత్వ ఆసుపత్రి లో డాక్టర్ మాన్విత జాతీయ జెండాలను ఆవిష్కరించి వందనం సమర్పించారు.

​అనంతరం బెజ్జూరు గ్రామ పంచాయతీలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ దుర్గం సరోజ తిరుపతి తొలిసారిగా పతాకావిష్కరణ చేయగా, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని పురాతన రంగనాయక స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు తంగడపల్లి మహేష్ జెండాను ఎగురవేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో సర్పంచులు, ఆయా రాజకీయ పార్టీల కార్యాలయాల్లో నాయకులు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి గణతంత్ర స్ఫూర్తిని చాటారు. ​పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు విద్యార్థుల కేరింతల మధ్య ఉత్సాహంగా సాగాయి.

క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథులు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలాపనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణలో ధరించిన వివిధ రూపాలు, దేశభక్తి నినాదాలు చేస్తూ మండల కేంద్రంలోని పురవీధుల గుండా నిర్వహించిన ర్యాలీ చూపరులను మంత్రముగ్ధులను చేసింది. ఎటు చూసినా భారతమాత కీర్తనలతో, దేశభక్తి నినాదాలతో మండల వ్యాప్తంగా కోలాహలం నెలకొంది. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, కార్యదర్శులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.