26-12-2025 06:53:03 PM
ములకలపల్లి,(విజయక్రాంతి): పాత గంగారం పంచాయతీ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సర్పంచ్ సోడే చైతన్య అశ్వారావుపేట నియోజక వర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణను కోరారు. శుక్రవారం దమ్మపేట మండలంలోని గడుగులపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి పాత గంగారం పంచాయతీ పరిధిలో ఉన్న సమస్యలపై వినతిని అందజేశారు.
పాత గంగారం పంచాయతీ ఎర్రగుంపు వలస ఆదివాసీ గ్రామానికి త్రాగు నీరు, విద్యుత్తు, రహదారి సౌకర్యాలు కల్పించాలని కోరారు. అలాగే పాత గంగారం నుండి వాగొడ్డు గుంపు కు మధ్యన బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని నిధుల మంజూరుకు కృషి చేయాలని కోరారు. సమస్యలపై ఎమ్మెల్యే ఆదినారాయణ సానుకూలంగా స్పందించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు సర్పంచ్ చైతన్య తెలిపారు.