26-12-2025 08:16:35 PM
జిల్లా పోలీస్ శాఖ – 2025 వార్షిక నివేదిక ఆవిష్కరణ
-రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై కఠిన చర్యలు
విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ డి.జానకి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని లక్ష్యంతోనే పోలీసులు రాత్రి పగలు భేదం లేకుండా పనిచేస్తున్నారని జిల్లా ఎస్పీ డి జానకి స్పష్టం చేశారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో పోలీస్ శాఖకు సంబంధించిన 2025 సంవత్సరపు వార్షిక నివేదికను విలేకరుల సమావేశంలో విడుదల చేసి మాట్లాడారు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కఠిన భద్రతా చర్యలు చేపట్టి ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించామని తెలిపారు.
ఎన్నికల తనిఖీల్లో రూ.11,08,250 నగదు, 1050.23 లీటర్ల మద్యం (విలువ రూ.6,93,858) స్వాధీనం చేసుకోగా, రూ.7,200 విలువగల ఉచితాల పంపిణీ సామగ్రి పట్టుబడిందన్నారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 9 కేసులు నమోదు చేసి, 458 మెమోలు జారీ చేసి, 640 మందిని బౌండ్ ఓవర్ చేశారని. 73 నాకాబందీ ఆపరేషన్లతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయన్నారు. నేర నియంత్రణలో భాగంగా 2024లో 5937 కేసులు నమోదుకాగా, 2025లో 5662 కేసులు మాత్రమే నమోదయ్యాయి, దీంతో నేరాల రేటు సుమారు 5 శాతం తగ్గిందని పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు 2024లో 9252 కాగా, 2025లో 11775 దరఖాస్తులను స్వీకరించి తక్షణ చర్యలు తీసుకున్నారని తెలిపారు.
మహిళలు,బాలికల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ షీ టీమ్స్, పోలీసు సురక్షా కళాబృందం భరోసా కేంద్రం ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని,“ భరోసా కేంద్రంలో 168 కేసులు నమోదు కాగా, 119 కేసుల్లో బాధితులకు నష్టపరిహారం అందించారని తెలిపారు. రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించగా,ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలు 2024లో 235 కాగా 2025లో 231 అయ్యాయని, ప్రాణాంతకము కాని ప్రమాదాలు 2024లో 255 కాగా 2025లో 286 అయ్యాయన్నారు. జాతీయ రహదారుల్లో ప్రమాదాలు 2024లో 425 నుంచి 2025లో 475కు పెరిగాయని, ఇతర రహదారుల్లో ప్రమాదాలు 2024లో 140 కాగా 2025లో 155 అయ్యాయన్నారు.
మొత్తం రోడ్డు ప్రమాద కేసులు 2024లో 1055 కాగా, 2025లో 1103 నమోదు కాగా, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు తీసుకుని 2025లో 3245 కేసులు, 2024లో 2578 కేసులు నమోదు చేశారని తెలిపారు. 2025లో రూ.32,59,386 జరిమానా, 2024లో రూ.28,94,085 జరిమానా విధించగా, 2025లో 21 మందికి, 2024లో 5 మందికి జైలు శిక్షలు విధించబడ్డాయన్నారు. సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా 2025లో 1475 దరఖాస్తులు స్వీకరించి 220 కేసులు నమోదు చేశారని, మొత్తం రూ.2,18,17,758 నష్టం జరగగా, అందులో రూ.1,98,79,364 విలువైన మొత్తాన్ని బాధితులకు తిరిగి అందించారు. గత సంవత్సరం కంటే 125 కేసుల్లో ఎక్కువగా రికవరీ చేయడం విశేషమన్నారు.
CIR పోర్టల్ ద్వారా 1173 మొబైల్ ఫోన్లు బాధితులకు అప్పగించారు. ఆస్తి నేరాల రికవరీ 29.85% నుంచి 46.89%కు పెరిగింది. 2025లో 327 ఆస్తి నేర కేసులు నమోదు కాగా, 215 మందిని అరెస్టు చేసి రూ.99,83,318 విలువైన ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాపై 32 మందిని అరెస్టు చేసి 11.850 కిలోల గంజాయి, 22 కిలోల ఆల్పరాజోలం (విలువ రూ.15,23,125) స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాల ద్వారా ఈ సంవత్సరం 1059 మంది బాలురు, 17 మంది బాలికలను బాల కార్మికులుగా ఉన్న స్థితి నుంచి విముక్తి చేసి కుటుంబాలకు అప్పగించారని తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా ఈ సంవత్సరం 1608 ఎఫ్ఐఆర్ కేసులు, 2739 డిడి & మోటారు వాహన చట్టం కేసులు, సహా మొత్తం 10,431 కేసులు పరిష్కరించబడ్డాయన్నారు.
జిల్లాలో ప్రతిరోజూ విధులతో పాటు ఇతర రంగాల్లోనూ జిల్లా పోలీస్ శాఖ ప్రతిభను చాటుకుందని, 2025 మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా ఆసియా ఖండానికి చెందిన 22 మంది సుందరీమణుల పిల్లలమర్రి సందర్శనను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా విజయవంతంగా నిర్వహించారని, జిల్లా మహిళా ఏఎస్ఐ శ్రీమతి వనజా రెడ్డి జాతీయ స్థాయి యోగా పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించగా, మహిళా కానిస్టేబుల్ రాధిక 74వ ఆల్ ఇండియా పోలీస్ క్లస్టర్ గేమ్స్‌లో ఆర్మ్ రెజ్లింగ్‌లో పథకం సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారన్నారు. ఇకపై కూడా ప్రజల భద్రత, మహిళల రక్షణ, బాలల సంక్షేమం, రోడ్డు భద్రత, సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు ప్రజలకు అండగా ఉన్నారని తెలిపారు. ఈ సమావేశం లో డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు ఉన్నారు.