తెలంగాణలో రిజర్వేషన్ల వార్

27-04-2024 03:06:19 AM

రెండు జాతీయ పార్టీల ప్రచారం దీని చుట్టే..

బీజేపీ వస్తే రిజర్వేషన్లు రద్దంటూ కాంగ్రెస్ ప్రచారం

అధికారం కోసం అసత్య ఆరోపణలంటూ కమలం కౌంటర్

హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా పార్టీల మధ్య రిజర్వేషన్ల వార్ నడుస్తోంది. ఏ విధంగా చూసినా ప్రస్తుతం రాజకీయమంతా రిజర్వేషన్ల చుట్టే నడుస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య రిజర్వేషన్లపై మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ అని రేవంత్ రెడ్డి విమర్శిస్తే... ఐఎన్‌సీ (కాంగ్రెస్) అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి ప్రత్యారోపణ చేశారు. రాష్ట్రంలో అక్రమంగా ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు కల్పించి బీసీలకు అన్యాయం చేసిందని, మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. రిజర్వేషన్లు ఉండాలా? రద్దు కావాలా? అనేందుకు పార్లమెంట్ ఎన్నికలు రిఫరెండం అంటూ కాంగ్రెస్ పార్టీ అంటోంది. రిజర్వేషన్లను రద్దు చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కులను కాలరాయాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆ పార్టీ ఆరోపించింది. దేశాన్ని ఎక్స్‌రే తీసి కులాలు, ఉపకులాల వారీగా జనాభాను లెక్కించి వాటి ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్ గాంధీ అంటున్నారని, కాంగ్రెస్ గెలిస్తే రిజర్వేషన్లు 75 శాతానికి చేరతాయని వాటిని రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలను బీజేపీ అమలు చేస్తోందని, అధికారంలోకి వస్తే దళితుల రిజర్వేషన్లను రద్దు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. 

మరోవైపు ఆర్‌ఎస్‌ఎస్ అనేది దేశభక్తి ఉన్న సంస్థ అని, తమలో సంఘ్ భావజాలం ఉందని గర్వంగా చెప్పుకుంటామని బీజేపీ నేతలు అంటున్ననారు. కాంగ్రెస్ భావజాలం ఏమిటి? పీఎఫ్‌ఐ భావజాల మా? ఐఎస్‌ఐ భావజాలమా? దేశద్రోహం, నక్సలైట్లు, ఐఎస్‌ఐకు సపోర్ట్ చేయడం వారి భావజాలమా? అంటూ కౌంటర్ ఇస్తున్నారు. రాజ్యాంగం మార్చడం కాంగ్రెస్ అలవాటని, కాంగ్రెస్ తాము అధికారంలో ఉన్నప్పుడు 46 సార్లు రాజ్యాంగాన్ని సవరించారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే అగ్రకులాలలోని పేదలకు రిజర్వేషన్లు వచ్చాయని, అలాంటిది ఉన్న రిజర్వేషన్లు ఎలా తీసేస్తామని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 

ఈ విధంగా రిజర్వేషన్ల అంశంపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒకరిపై మరొకరు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. వారి పార్టీల పేరునే యూరోపియన్ దేశాల పేరుతో మార్చి ఆరోపణలకు దిగుతున్నారు. బ్రిటిష్ జనతా పార్టీ అంటూ బీజేపీపై కాంగ్రెస్ తీవ్రమైన ఆరోపణలు చేస్తే... సోనియా గాంధీ జాతీయతను ట్యాగ్ చేస్తూ ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అంటూ బీజేపీ ఎదురుదాడికి దిగింది. ప్రధాన పార్టీలే ఇలా వారి వారి పార్టీలకు వేరే దేశాల జాతీయతను అంటగడుతూ విమర్శలకు దిగడంపై ప్రజలు విస్తుపోతున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మాట్లాడి ప్రచారం చేయాలని కానీ, ఇలా పేర్లపై ఎదురుదాడి చేసుకోవటం ఏంటనే చర్చ జరుగుతోంది. చౌకబారు వ్యాఖ్యలతో దేశం పరువు తీయవద్దని అన్ని పార్టీల నేతలకు పలువురు హితవు పలుకుతున్నారు. 

వందల ఏళ్ల క్రితం భారతీయులను విభజించి పాలించిన ఈస్ట్ ఇండియా కంపెనీ తరహాలో ప్రధాని మోదీ, అమిత్ షా ప్రవర్తిస్తున్నారు. సముద్రం పక్కన వ్యాపారం చేసుకుంటామంటూ ఈస్ట్ ఇండియా కంపెనీ సూరత్‌లో వ్యాపారం ప్రారంభించి దేశాన్ని ఆక్రమించారు. బ్రిటీష్ పాలనలో దేశంలో రిజర్వేషన్లు లేవు. వారి ఆలోచనలనే మోదీ, అమిత్ షా అమలు చేయాలని చూస్తున్నారు. అందుకే బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు... బ్రిటీష్ జనతా పార్టీ. ఆ పార్టీ అభ్యర్థులను చిత్తుగా ఓడించండి. 

 కంటోన్మెంట్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి 

దేశాన్ని 200 ఏళ్ల్లు బ్రిటీష్ వాళ్లు పాలించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ బ్రిటీష్ ప్రతినిధిగా ఇటలీకి చెందిన సోనియా గాంధీని దేశానికి ప్రధానిని చేయాలని ప్రయత్నించింది. సోనియాను ప్రధాని కాకుండా ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకుం టామని బీజేపీ చెప్పడంతోనే మన్మోహన్ సింగ్‌ను రిమోట్ కంట్రోలర్ ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాస్త ఇటలీ నేషనల్ కాంగ్రెస్ పార్టీగా మారిపోయింది. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఉండవనే ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకే ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తోంది.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి