calender_icon.png 28 October, 2025 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగ సవరణతోనే బీసీలకు రిజర్వేషన్లు

28-10-2025 06:11:40 PM

బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా వైస్ చైర్మన్ బోనగాని యాదగిరి గౌడ్..

హనుమకొండ (విజయక్రాంతి): తరాలు మారినా, యుగాలు మారినా బీసీల తలరాతలు ఏ మాత్రం మారడం లేదని, స్వాతంత్రం సిద్ధించి 79 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ బీసీలు ఓట్లు వేసే యంత్రాలుగా, జెండాలు మోసే కార్యకర్తలు గానే మిగిలిపోతున్నారని, దేశంలో సగభాగానికి పైగా ఉన్న బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడ్డారని, సామాజిక న్యాయం జరగాలంటే అది రాజ్యాంగ సవరణతోనే సాధ్యమని బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా వైస్ చైర్మన్ బోనగాని యాదగిరి గౌడ్ అన్నారు.

మంగళవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, బీసీ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ను గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా వైస్ చైర్మన్ బోనగాని యాదగిరి గౌడ్ తో పాటు గోపా హన్మకొండ జిల్లా అధ్యక్షులు చిర్ర రాజు గౌడ్, గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టు రమేష్ గౌడ్, బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మనిమంజరి, బీసీ మహిళా సంఘం నాయకులు పోశాల పద్మ గౌడ్ లు హైద్రాబాద్ లోని బీసీ సంక్షేమ సంఘం కేంద్ర కార్యాలయంలో ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా బీసీ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ గా నియమితులైన జాజుల శ్రీనివాస్ గౌడ్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు.

అనంతరం బోనగాని యాదగిరి గౌడ్ మాట్లాడుతూ బీసీలలో 136 కులాలున్నాయని, దేశ సంపదను సృష్టించేది బీసీకులస్తులేనని, దేశ సంపదలో వాటాను పంచుకోలేకపోతున్నారన్నారు. దేశ సంపదను 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులస్తులు సృష్టిస్తే, కేవలం 10 శాతం ఉన్న అగ్రవర్ణాల వారు ఆ సంపదను దోచుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి మూల కారణం చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడమేనన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల కోటాతో పాటు చట్ట సభలలో సైతం విద్యా, ఉద్యోగ, పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు దక్కాలంటే తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ జరగాల్సిన అవసరం ఉందన్నారు.

పది శాతం ఉన్న అగ్రవర్ణాలు దేశాన్ని శాసిస్తుంటే దేశ సంపదను సృష్టించేవారు బానిసలుగా బతకాల్సిన అవసరం లేదన్నారు. అందుకే మేమెంతో మాకంత వాటా అంటూ బీసీ సోదరులంతా రిజర్వేషన్ల సాధనకై పోరుబాట పట్టాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ జేఏసీ ఇచ్చే ప్రతి కార్యాచరణలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులను కలుపుకొని మరో స్వతంత్ర పోరాటాన్ని మించిన పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికైనా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, బీసీ ప్రధానిగా చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ బీసీలకు రాష్ట్రాలలో, చట్టాలలో రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.