28-10-2025 08:55:10 PM
మేడిపల్లి (విజయక్రాంతి): పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఫిర్జాదిగూడలోని జ్ఞాన జ్యోతి ఫార్మ కాలేజీ, బోడుప్పల్ లోని విజన్ ఫార్మా కాలేజీ విద్యార్థులకు సైబర్ క్రైమ్ పై అవగాహన, ఆన్లైన్ మోసాలు, సోషల్ మీడియా భద్రత, సైబర్ క్రైమ్ నుంచి రక్షణ చర్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మేడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పోలీస్ శాఖ పనితీరు, ఆయుధాల వినియోగం, కమ్యూనికేషన్ వ్యవస్థ, పోలీసు సిబ్బంది సేవా త్యాగాల గురించి తెలియజేశారు.
కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థుల చేత మానవహారం, “TRIBUTES TO THE MARTYRED POLICE PERSONNEL” అనే శీర్షికతో పోలీసు అమరవీరులకు విద్యార్థులు దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ సిబ్బందిని స్మరించి, నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి మాట్లాడుతూ పోలీస్ అమరవీరులు తమ ప్రాణాలను పణంగా పెట్టి సమాజ రక్షణ కోసం చేసిన త్యాగాలు ఎప్పటికీ మరవలేనివి వారిని స్మరించుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ చక్రపాణి, సిఐ గోవిందరెడ్డి, పోలీస్ సిబ్బంది, కళాశాల, స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.