calender_icon.png 28 October, 2025 | 11:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామీణ వైద్యులపై దాడులు ఆపాలి

28-10-2025 08:45:04 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు ప్రథమ చికిత్స వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపి, పిఎంపి, ప్రథమ చికిత్స వైద్యులపై ఇటీవల టీజిఎంసి సభ్యులు దాడులు చేయడాన్ని ఆపాలని వారికి శిక్షణలు ఇచ్చి ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం‌ ప్రజా భవన్లో ప్రజా భవన్ ఇంచార్జీ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాజీ మంత్రి డాక్టర్ జి.చిన్నారెడ్డికి ప్రథమ చికిత్స వైద్యుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద వేణుగోపాల్ గౌడ్, ప్రథమ చికిత్స వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు కొమ్ము గణేష్ లు కలసి మంగళవారం స్వయంగా వినతి పత్రం అందజేసి, పరిస్థితిని వివరించగా మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఎండార్స్ చేసి ఆన్ లైన్ చేపించి పంపించడం జరిగిందని తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురాతన కాలం నుండి గ్రామీణ పేద ప్రజలకు అత్యవసర సమయంలో ప్రథమ చికిత్స వైద్య సేవలు అందిస్తూ పేద ప్రజల మధ్యలో మమేకమై ఉంటున్నామని, రాత్రి, పగలు, అనే తేడా లేకుండా చలికి, వానకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా రోగులకు ప్రథమ చికిత్స వైద్యం అందించి తప్పనిసరి పరిస్థితుల్లో మెరుగైన వైద్యం కోసం సంబంధిత ప్రభుత్వ హాస్పిటల్ కు కానీ లేదా పేషేంట్ల అభిప్రాయం మేరకు క్వాలీఫైడ్ డాక్టర్ ల వద్దకు పంపించి మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో గ్రామీణ వైద్యులకు గుర్తింపు ఇస్తామని 429 జీవో ప్రకారము కొంత కాలం శిక్షణలు ఇచ్చారని గుర్తు చేసినట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామీణ వైద్యులకు శిక్షణలు ఇచ్చి,టీజిఎంసి సభ్యుల దాడులు ఆపి గ్రామీణ వైద్యులను ఆదుకోవాలని కోరినట్లు తెలిపారు. ప్రజా భవన్ ఇంచార్జీ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాజీ మంత్రి డాక్టర్ జి.చిన్నారెడ్డి పూర్తి వివరాలు విని గ్రామీణ ప్రాంతాల్లో ప్రథమ చికిత్స వైద్యం అందించేది గ్రామీణ వైద్యలేనని మీ కోరిక న్యాయబద్దమైనదేనని భావించి మీరు లేకపోతే గ్రామాల్లో ప్రథమ చికిత్స వైద్యం అందకుండా పోతుందని భావించి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని  వెంటనే సంబంధిత ఆరోగ్య శాఖ అధికారులకు ఎండార్స్ చేశారు. వెంటనే స్పందించి మా వినతి పత్రం స్వికరించిన డాక్టర్ జీ.చిన్నారెడ్డికి, అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.