28-10-2025 08:38:20 PM
వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి.నిర్మలా గీతాంబ
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ ములుగు రోడ్డులోని రెనోవా బన్ను క్యాన్సర్ హాస్పిటల్స్ వారు మంగళవారం నిర్వహించిన మహిళలకు కొమ్ము క్యాన్సర్ పట్ల అవగాహన కార్యక్రమానికి వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి.నిర్మలా గీతాంబ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యాధిగ్రస్తులకు పండ్లను అందించారు. అనంతరం మాట్లాడుతూ క్యాన్సర్ మహమ్మారిని ముందే గ్రహించగలిగితే, దాని నివారణ సులభతరం అవుతుందని, తద్వారా ప్రాణాపాయ స్థితి నుండి బయటపడవచ్చని తెలిపారు. సరైన అవగాహన లేక మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారని, భయం కన్నా ప్రాణం విలువైనదని తెలిపారు.
క్యాన్సర్ చికిత్సలకు నిపుణులైన వైద్యులు, అత్యాధునిక వైద్య సదుపాయాలతో క్యాన్సర్ ను మొదటి దశలోనే ఆపడం సులభతరమని పేర్కొన్నారు. క్యాన్సర్ మహమ్మారి నుండి కోలుకున్న వారిని ఉదాహరణగా తీసుకొని ధైర్యంగా ఉండాలని తెలిపారు. క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండి, సరైన నియమ నిబంధనలు పాటిస్తే క్యాన్సర్ ను ఎదుర్కొనవచ్చును అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా న్యాయ అధికార సంస్థ కార్యదర్శి ఎం సాయికుమార్, వరంగల్ జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షులు వలస సుధీర్, రెనోవ బన్ను క్యాన్సర్ హాస్పటల్ డాక్టర్లు ప్రియాంక, శివకుమార్, వినోద్ కుమార్, విష్ణువర్ధన్ రెడ్డి, తరుణ్ రెడ్డి, రవీందర్ రెడ్డి, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.