30-09-2025 02:23:27 AM
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): మోదీ నాయకత్వంతోనే చట్టసభల లో రిజర్వేషన్లు సాధిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య అన్నారు. ఈ మేరకు సోమవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్‌లో దక్షిణ భారత బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జబ్బాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీలకు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఓబిసి జాతీయ సెమినార్లను జరపాలని అక్టోబర్ 12న విజయవాడలో ఓబీసీ జాతీయ సెమినార్ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.
సెమినార్ కు సంబంధించిన వాల్పోస్టర్‌ను ఆయన పలు బీసీ సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావే శంలో ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తొలిసారిగా జన గణనలో కుల గణన చేపడుతుందన్నారు ఇది దేశ చరిత్రలో రికార్డు అని, 76 సంవత్సరాల చరిత్రలో ఏ పార్టీ కూడా కులగరణ చేయలేదన్నారు.
కులగరణ తర్వాత బీసీలకు అన్ని రంగాలలో ముఖ్యంగా ఆర్థిక , రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగ రంగాలలో జనాభా ప్రకారం వాటా లభిస్తుందన్నారు. అక్టోబర్ 12న విజయ వాడలో జరిగే ఓబీసీల జాతీయ సెమినార్ కు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుండి ప్రొఫెసర్లు, మేధావులు, కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల పార్లమెంట్ సభ్యులు పాల్గొంటారని ఆయన వెల్లడించారు.
ఈ సెమినార్ ను బీసీలంతా అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, బీసీ సంఘం నేతలు మణికంఠ, సీ. రాజేందర్, భూపేష్ సాగర్, పగిళ్ల సతీష్ కుమార్, అర్జున్ రావు, చిక్కుడు బాలయ్య తదితరులు పాల్గొన్నారు.