calender_icon.png 30 September, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నిక ఏదైనా.. గులాబీదే హవా!

30-09-2025 02:14:00 AM

  1. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీఆర్‌ఎస్ అభ్యర్థులదే విజయం 
  2. ‘బాకీ కార్డు’తో రేవంత్ సర్కార్ భరతం పడతాం
  3. టీడీపీ సీనియర్ నేత ప్రదీప్ చౌదరి బీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంలో కేటీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): ఎన్నిక ఎదైనా.. గులాబీ జెండా హవా కొనసాగుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. గల్లీ ఎన్నికలైనా.. ఢిల్లీ ఎన్నికలైనా గెలిచేది బీఆర్‌ఎస్ అభ్యర్థులేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు ప్రారంభించిన ‘బాకీ కార్డు’ ఉద్యమమే రేవంత్ సర్కార్‌ను భరతం పట్టే బ్రహ్మాస్త్రమన్నారు.

సోమవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ప్రదీప్ చౌదరి కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సంద ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తాము ఇచ్చిన హామీలను ప్రజలు మరచిపోయారన్న భ్రమల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారని, కానీ ప్రజలకు అన్నీ గుర్తున్నాయన్నారు.

కాంగ్రెస్ అబద్ధపు హామీలను గుర్తుచేయడానికే ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ఉద్యమాన్ని ప్రారంభించామని తెలిపారు. కాంగ్రెస్ అభయహస్తం ఆ పార్టీ పాలిట భస్మాసుర హస్తంగా మారిందని విమర్శించారు. ఈ బాకీ కార్డే కాంగ్రెస్ పతనాన్ని శాసిస్తుందన్నారు. 

కొత్త నగరం కడతామని ఫోజులు హాస్యాస్పదం

హైదరాబాద్ నగరం సమస్యలతో ఆగమాగం అవుతుంటే ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి కొత్త నగరం కడతానంటూ ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఉన్న నగరాన్ని ఉద్ధరించలేని వారు కొత్త నగరం కడతామని ఫోజు లు కొట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో 42 ఫ్లుఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇటుక కూడా పేర్చలేదని, కనీసం ఉన్న రోడ్లను కూడా సరిగా నిర్వహించడం లేదని విమర్శించారు.

రాష్ర్టంలో రైతులు, మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులు, విద్యార్థులు సహా అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కేటీఆర్ అన్నారు. ఎరువుల కోసం క్యూలైన్లలో చెప్పులు పెట్టే, ప్రాణాలు కోల్పోయే దారుణ పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు.