30-09-2025 02:09:52 AM
సినీ లోకాన్ని వణికించిన పైరసీ ముఠా అరెస్టు
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): దేశ సినీ పరిశ్రమను పెనుభూతంలా పట్టి పీడిస్తున్న పైరసీ సామ్రా జ్యంపై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. సినిమా విడుదల కాకముందే డిజిటల్ సర్వర్లను హ్యాక్ చేస్తూ, విడుదలైన క్షణాల్లోనే థియేటర్లలో రికార్డ్ చేస్తూ వేల కోట్ల రూపాయల నష్టానికి కారణమవుతున్న అతిపెద్ద ముఠాను అరెస్టు చేసి సంచలనం సృష్టించారు. ఈ కేసులో జూలై ౩న హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ప్రధాన నిందితుడు జాన కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. అతడి సమాచారంతో వివిధ రాష్ట్రాలకు చెందిన ఆరుగురు కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నామని
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. అన్ని భాషల్లో ౫౦౦కు పైగా సినిమాలను వీరు పైరసీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. వీరి నుంచి భారీ మొత్తంలో సీపీయూలు, హార్డ్ డిస్కులు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా కార్యకలాపాల వల్ల కేవలం 2023లోనే భారత సినీ పరిశ్రమకు ఏకంగా రూ.22,400 కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా.
ఇందులో సింహభాగం తెలుగు చిత్ర పరిశ్రమకే దక్కిందని, సుమారు రూ.3,700 కోట్ల నష్టంతో టాలీవుడ్ కుదేలైందని తెలుస్తున్నది. నిందితులు ఇటీవల భారీ అంచనాలతో విడుదలైన హిట్ ది థర్డ్ కేస్, సింగిల్, కుబేరా, హరి హర వీర మల్లు వంటి సినిమాలను కూడా పైరసీ చేశారు. తామిల్ బ్లాస్టార్, మూవీ రూల్స్ వంటి వందలాది పైరసీ వెబ్‌సైట్ల ద్వారా వీరు తమ దందాను యథేచ్ఛగా కొనసాగించారని సీవీ ఆనంద్ వెల్లడించారు.
టెక్నాలజీతో దోపిడీ.. రెండు మార్గాల్లో పైరసీ
నిందితులు పైరసీకి రెండు ప్రధాన మార్గాలను అనుసరించారు. థియేటర్లలోకి అత్యాధునిక కెమెరాలున్న స్మార్ట్‌ఫోన్లను తీసుకెళ్లి పైరసీకి పాల్పడేవారు. జేబులో లేదా పాప్‌కార్న్ డబ్బాలో ఫోన్‌ను పెట్టి, రికార్డింగ్ చేస్తున్నప్పుడు స్క్రీన్ లైట్ కూడా ఆఫ్‌లో ఉండేలా ఒక ప్రత్యేక యాప్‌ను వాడేవారు. దీంతో పక్కనున్న వారికి కూడా అనుమానం వచ్చేది కాదు. జానా కిరణ్‌కుమార్ అనే నిందితుడు ఈ విధానంలో కీలకంగా వ్యవహరించాడు.
డిజిటల్ మీడియా కంపెనీల సర్వర్లను, కొన్నిసార్లు శాటిలైట్ ఫీడ్‌ను సైతం హ్యాక్ చేసి సినిమా కాపీలను విడుదల కంటే ముందే దొంగిలించేవారు. ఇలా దొంగిలించిన సినిమాలను టెలిగ్రామ్ ఛానళ్లు, టొరెంట్ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేసి ఆదాయం పొందేవారు. సింగిల్, హిట్ వంటి సినిమాలపై ఫిర్యాదులు రావడంతో ఈ కేసుపై పోలీసులు దృష్టి సారించారు.
పక్కా స్కెచ్‌తో పట్టుకున్నారు
వివిధ రాష్ట్రాలకు చెందిన నిందితులను సాంకేతిక ఆధారాలతో పోలీసులు పట్టుకున్నారు. అశ్వని కుమార్ (21, బీహార్).. ఇతను హ్యాకింగ్ నిపుణుడు. సర్వర్లను హ్యాక్ చేసి, కాపీలను ఒక్కొక్కటి 800 డాలర్లకు టెలిగ్రామ్ గ్రూపుల్లో అమ్మేవాడు. సిరిల్ ఇన్ఫంట్ రాజ్ అమలదాస్ (32, తమిళనాడు).. ఇతనే ఈ రాకెట్‌కు మాస్టర్‌మైండ్. తామిల్ బ్లాస్టార్ సైట్‌ను నడిపిస్తూ, థియేటర్ రికార్డింగ్ కోసం ఏజెంట్లను నియ మించేవాడు.
సుధాకరన్ (31, తమిళనాడు).. సుమారు 35 సినిమాలను నేరుగా థియేటర్లలో రికార్డ్ చేసి అప్‌లోడ్ చేశాడు. జాన కిరణ్‌కుమార్ (29, ఆంధ్రప్రదేశ్).. హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఉంటూ మంత్రా మాల్‌తోపాటు అనేక థియేటర్లలో ఏకంగా 100 సినిమాలను రికార్డ్ చేశాడు. ప్రతి సినిమాకు 300 నుంచి 400 డాలర్స్ తీసుకునేవాడు. అర్సలాన్ అహ్మద్ (23, బీహార్).. ఫైల్ షేరింగ్ సైట్ల ద్వారా పైరసీ కంటెంట్‌ను వ్యాప్తి చేసేవాడు. ఇండియన్ సైబర్‌క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సహకారంతో క్రిప్టో లావాదేవీల మూలాలను కనుగొన్నారు.
హ్యాకింగ్‌లో ఘనుడు.. ఇంట్లో 22 సీసీ కెమెరాలు
ఈ ముఠాలో పట్నాకు చెందిన అశ్వనీకుమార్ అనే వ్యక్తి హ్యాకింగ్‌లో అత్యంత నిపుణుడు. ఇతనికి డిజిటల్ మీడియా సర్వర్లను హ్యాక్ చేయడంలో అపార నైపుణ్యం ఉంది. కేవలం సినిమాలే కాదు, కొన్ని ప్రభుత్వ వెబ్‌సైట్లను కూడా హ్యాక్ చేసినట్లు విచారణలో తేలింది. ఏకంగా ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి ఉద్యోగుల జీతభత్యాల వివరాలు, ఓటర్ల జాబితాను కూడా చూడగలిగాడని సీపీ తెలిపారు. పోలీసులు తనను పట్టుకోలేరన్న ధీమాతో పట్నాలోని తన ఇంటికి ఏకంగా 22 సీసీటీవీ కెమెరాలు పెట్టుకున్నాడు. పోలీసులు అక్కడికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
బెట్టింగ్ యాప్స్.. క్రిప్టోలో చెల్లింపులు
ఈ పైరసీ వెబ్‌సైట్లను నడపడానికి ప్రధా న ఆదాయ వనరు బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల ప్రకటనలే. నిందితుడు సిరిల్ అనే వ్యక్తి నెదర్లాండ్స్, ప్యారిస్ ఐపీ అడ్రస్‌లతో సైట్లను నిర్వహిస్తుండగా, బెట్టింగ్ యాప్ నిర్వాహకులు అతనికి నెలకు సుమారు రూ.9 లక్షల వరకు క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లించేవారు. పోలీసులు మమ్మల్ని ఎప్పటికీ పట్టుకోలేరు అనుకున్నాం. మీరు కేసును ఛేదించిన విధానం తెలిసి షాక్ అయ్యాం అని నిందితుడు విచారణలో అంగీకరించినట్లు సీపీ పేర్కొన్నారు. ఈ ముఠా పైరసీ ద్వారా సుమారు రూ.83 లక్షలు వరకు ఆర్జించిందని పోలీసులు గుర్తించారు.
ఉచితం వలలో పడొద్దు
పైరసీ సైట్లలోని లింకులను క్లిక్ చేస్తే యూజర్ల వ్యక్తిగత వివరాలు, ఫోన్ డేటా మొత్తం ముఠా చేతికి వెళ్తుందని సీపీ హెచ్చరించారు. దీనివల్ల బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందన్నారు. డిజిటల్ మీడియా సంస్థలు తమ సర్వర్ల భద్రత విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పైరసీని ప్రోత్సహించడం కూడా నేరమేనని, అందరూ కలిసికట్టుగా పోరాడితేనే సినీ పరిశ్రమను కాపాడుకోగలమని ఆయన పిలుపునిచ్చారు.
పోలీసులకు కృతజ్ఞతలు: దిల్ రాజు
ఎఫ్‌డీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. ఈ ముఠాని అరెస్ట్ చేసినందుకు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులకు సినీ ఇండస్ట్రీ తరపున ఆయన ధన్యవా దాలు తెలిపారు. పైరసీతో కేవలం సినీ పరిశ్రమకే కాదు ప్రభుత్వ ఆదాయానికి కూడా నష్టం కలుగుతుందని చెప్పారు. పైరసీ వెనుక బెట్టింగ్ యాప్‌ల పాత్ర కూడా ఉందని అన్నారు.
పోలీసులతో టాలీవుడ్ ఉన్నతస్థాయి సమావేశం
ఈ భారీ ఆపరేషన్ అనంతరం, సీపీ సీవీ ఆనంద్ చొరవతో తెలుగు సినీ ప్రముఖులతో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీకి చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, నాని, దిల్ రాజు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, పైరసీని అంతమొందించడానికి పరిశ్రమ, పోలీసులు కలిసి పనిచేయాలి. బెట్టింగ్ యాప్‌లే వీరికి నిధులు సమకూరుస్తున్నాయి, అని తెలిపారు. నిర్మాతలు తప్పనిసరిగా ఫోరెన్సిక్ వాటర్‌మార్కింగ్ టెక్నాలజీని వాడాలని, థియేటర్లలో నిఘా పెంచాలని, డిజిటల్ సంస్థలు తమ సర్వర్ల భద్రతను పటిష్టం చేసుకోవాలని ఆయన సూచించారు.