calender_icon.png 30 September, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సద్దుల బతుకమ్మ సందడి X బతుకమ్మ @ గిన్నిస్ రికార్డు

30-09-2025 02:29:35 AM

  1. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి, ఆడి పాడిన మహిళలు
  2. జాతరను తలపించిన గ్రామాలు
  3. రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయా నికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సోమవారం సద్దుల బతుకమ్మతో ముగిసింది. పుట్టింటికి వచ్చిన మహిళల ముఖా ల్లో సంతోషాలు తొణికసలాడుతుండగా, ఇండ్లన్నీ పూలవనాలయ్యాయి. గ్రామాల్లో మహిళలంతా చేరి బతుకమ్మను ఆడిన దృ శ్యాలు జాతరను తలపించాయి. గ్రామాల్లో సోమవారం ఉదయాన్నే నిద్రలేచి మగవారంతా సమీపంలోని పొలాలు, అటవీ ప్రాం తాలకు వెళ్లి తీరొక్క పూలను సేకరించి సం చుల్లో ఇళ్లకు తీసుకు వెళ్లగా.. ఇంట్లోని మహిళలు, యువతులు ఆనందంగా బతుకమ్మలను అత్యంత సుందరంగా పేర్చారు.

ఒకరి తో మరొకరు పోటీపడుతూ ఉత్సాహంగా బతుకమ్మలను పేర్చారు. రాష్ట్రంలోని కొన్ని చోట్ల పది అడుగులకు పైగా బతుకమ్మలను పేర్చి అబ్బురపరిచారు. ధనిక పేదా అన్న తేడా లేకుండా మహిళలు, యువతులు ప్రకృతి ఒడిలో లభించే తీరొక్కపూలతో బతుకమ్మలను పేర్చి, గ్రామాలు, పట్టణాల్లోని ప్రధాన చౌరస్తాల వద్ద బతుకమ్మలను ఉంచి ఉత్సాహంగా ఆటపాటలతో హోరెత్తించారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడిపాడారు.

మొదటి రోజు ఎంగిల పూలతో ప్రారంభమైన బతుకమ్మ సంబురాలో తొమ్మిది రోజు లపాటు మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రోజుకో పేరున బతుకమ్మను పూ జించి తొమ్మిదవ రోజున సద్దుల బతుకమ్మ ఆడి.. పోయిరా బతుకమ్మ పోయిరావమ్మా అంటూ పాటలు పాడి సాగనంపారు. గ్రామపంచాయతీ, మున్సిపాలిటీల ఆధ్వర్యంలో చెరువులు, కుంటల వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.

బతుకమ్మ @ గిన్నిస్ రికార్డు

  1. సరూర్ నగర్ స్టేడియంలో 63 అడుగుల బతుకమ్మను ప్రతిష్ఠించిన రాష్ర్ట పర్యాటక శాఖ 
  2. ఒకేసారి బతుకమ్మ ఆడిన 1,354 మంది మహిళలు 
  3. అతిపెద్ద జానపద నృత్యంగా, అతిపెద్ద బతుకమ్మగా రెండు గిన్నిస్ బుక్ రికార్డులు 
  4. గిన్నిస్ బుక్ రికార్డును అందుకున్న మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క

ఎల్బీనగర్, సెప్టెంబర్ 29: తెలంగాణ బతుకమ్మ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో  చో టు సంపాదించుకున్నది. సరూర్ నగర్  స్టేడియంలో సోమవారం సాయంత్రం భారీస్థాయిలో రాష్ర్ట పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మన బతుకమ్మ సంబురాలు రెండు గిన్నిస్ వరల్ రికార్డులు సాధించింది. అతిపెద్ద జానపద నృత్యంగా, అతిపెద్ద బతుకమ్మగా రికార్డు సృష్టించింది. గిన్నిస్ రికార్డే లక్ష్యంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రెండు నెలలుగా 63 అడుగుల ఎత్తయిన బతుకమ్మను రూపొందించారు.

ఒకేసారి 1,354 మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ రెండూ కూడా గిన్నిస్ రికార్డును సాధించాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు హాజరయ్యారు. గిన్నిస్ బుక్ రికార్డు సభ్యులు గిన్నిస్ బుక్ రికార్డు ఆఫ్ బతుకమ్మ సర్టిఫికేట్‌ను మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్కకు అందజేశారు. 

ఈ సందర్భంగా పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, బతుకమ్మ పండుగను ప్రపంచంలో ఉన్న నలుమూలల నుంచి చాటిచెప్పిన ఘనత మనకు దక్కిందన్నారు. ఆడబిడ్డల ఐక్యత వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గల్లీల్లో గరిట తిప్పిన చేతులు నేడు బతుకమ్మను తయారుచేసి గిన్నిస్ బుక్ రికార్డు సాధించడం గొప్ప శుభ పరిణామమన్నారు.

ఏ రంగంలోనైనా ముందడుగు వేస్తామని, ఆకాశాన్ని సైతం చీల్చుకొని అన్ని రంగాలలో మహిళలు ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా గాయని విమలక్క మాట్లాడుతూ.. సమ్మక్క సారక్క, చాకలి ఐలమ్మ, మాదిరిగా ప్రతి ఒక్కరూ అద్భుతమైన బతుకమ్మ ప్రదర్శన నిర్వహించారని మహిళలను అభినందించారు.

ప్రముఖ గాయని గీతామాధురి బతుకమ్మ గీతాలు ఆలపించి మహిళలను ఉత్తేజపరిచారు. బతుకమ్మ ఉత్సవాలకు వివిధ జిల్లాల నుంచి మహిళలను అధికారులు తరలించారు. కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూ టీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, బండ్రు శోభారాణి, అలేఖ్య పుం జాల, క్రాంతి మహిళలు అధిక సం ఖ్యలో పాల్గొన్నారు. 

బతుకమ్మ ఆడిన మిస్ వరల్డ్

సరూర్ నగర్ స్టేడియంలో బతుకమ్మ వేడుకలకు ప్రత్యేక అతిథిగా మిస్ వరల్డ్ విజేత ఒపాల్ సుచాత చువాంగ్ పాల్గొన్నారు. మంత్రి సీతక్క, మేయర్ విజయలక్ష్మితో కలిసి సుచాత చువాంగ్‌తోపాటు మిస్ వరల్డ్--2025 బృందం బతుకమ్మ ఆడారు. తెలంగాణ సంప్రదాయ దుస్తులు ధరించిన విదేశీయులు ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బతుకమ్మ పాటలు, ఆడపడుచుల ఆటలతో సరూర్ నగర్ స్టేడియం మైదానం దద్దరిల్లింది.