28-01-2026 12:00:00 AM
షాద్‌నగర్, జనవరి 27 (విజయక్రాంతి): ఉపాధి లేక, సాగునీరు అందక చౌదర్గూడ మండలంలోని గిరిజన తండాలు ఖాళీ అవుతున్నాయి. బతుకుదెరువు కోసం ముంబై, పూణే వంటి నగరాలకు వలస వెళ్తూ గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రజా సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మిస్తే తప్ప ఈ ప్రాంత రైతుల తలరాత మారదని వారు స్పష్టం చేశారు. మంగళవారం పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి నేతృత్వంలో ప్రతినిధి బృందం చౌదర్గూడ మండలంలోని చెగిరెడ్డి ఘనపూర్, వేపకుచ్చతండా, చింతకుంట తండాలలో పర్యటించి నిజానిర్ధారణ చేపట్టింది.
ఈ సందర్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పలు కీలక అంశాలను లేవనెత్తారు.ఈ ప్రాంతంలో ఒక్కో తండాలో 80 నుంచి 90 కుటుంబాలు ఉంటే, అందులో 60 నుంచి 70 కుటుంబాలు వలస వెళ్లడం దారుణమని వారు పేర్కొన్నారు. సొంత భూమి ఉన్నప్పటికీ, ఎన్ని బోర్లు వేసినా నీరు పడకపోవడంతో రైతులు వ్యవసాయాన్ని వదిలి కూలీలుగా మారుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.వలస వెళ్లిన చోట ప్రమాదాల బారిన పడి గిరిజనులు మరణిస్తున్నారని, ఈ మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. గత పాలకులు ఈ ప్రాంత ప్రజలను మోసం చేశారు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోంది‘ అని నాయకులు విమర్శించారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసమే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని పక్కన పెట్టారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా రిజర్వాయర్ నిర్మాణానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని వారు ప్రశ్నించారు.వెంటనే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులు ప్రారంభించకపోతే, భవిష్యత్తులో గిరిజనులను, రైతులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో టీజీ శ్రీనివాస్ (తెలంగాణ విద్యావంతుల వేదిక), అర్జునప్ప (ప్రజా ముందు), తిరుమలయ్య (పౌరహక్కుల సంఘం), రవీంద్రనాథ్, నర్సింలు, రామచందర్, ఆకాష్ (AISF జిల్లా ఉపాధ్యక్షులు) స్థానిక రైతులు పాల్గొన్నారు.