12-04-2025 12:32:20 AM
హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): ప్రభుత్వం జారీ చేసిన జీవో 21ను ఉపసంహరించుకోవాలని, తమ ఉద్యోగాలను క్రమ బద్ధీకరించాలని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డిమాండ్ చేస్తూ.. శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల జేఏసీ పిలుపుమేరకు 12 వర్సిటీల్లో ర్యాలీలు నిర్వహించారు.
అంతేకాకుం డా అడ్మినిస్ట్రేటివ్, అకాడమీ విభాగాల అదనపు బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. వివిధ విభాగాలకు ఇన్‌చార్జిలుగా ఉన్న దాదాపు 300 మంది అసిస్టెం ట్ ప్రొఫెసర్లు ఆయా బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు వెల్లడించారు.
ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాతనే వర్సిటీల్లో అధ్యాపక పోస్టులకు రిక్రూట్‌మెంట్ చేపట్టాలని ప్రభుత్వానికి లేఖ రాయాలని వర్సిటీ వీసీలకు విజ్ఞప్తి చేసినట్టు జేఏసీ నేతలు డా.ఏ.పరశురామ్, డా.డి.ధర్మతేజ, డా.వేల్పుల కుమార్ తెలిపారు. 15 నుంచి 30 ఏండ్లుగా విధులు నిర్వర్తిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించకుండా నియామకాలు చేపడితే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ఎదుట ఆల్ యూని వర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ నాయకులు డా.సోమేశ్వర్, డా.జానకిరెడ్డి, డా.వరలక్ష్మి, డా.తిరునహరి శేషు మాట్లాడారు. పార్ట్ టైం అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఈ నెల 17న నిర్వహించబోయే ఛలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే రాజేందర్, ఎమ్మెల్సీ శ్రీపాల్
తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేపట్టిన ధర్నా వద్దకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి వెళ్లి వారితో మాట్లాడారు. అధ్యాపకుల సమస్యను ప్రభుత్వం దృషికి తీసుకెళ్తానని చెప్పారు. టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి సైతం హాజరై గతంలోనే సమస్యను ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని, రెండు మూడు రోజుల్లో సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.