24 June, 2026 | 1:59 AM

మా రైతుల సమస్యలను పరిష్కరించండి

24-06-2026 12:00 AM

మొక్కజొన్న, జొన్నలను కేంద్రం మద్దత ధరకు కొనుగోలు చేయాలి

తెలంగాణకు తక్షణమే డీఏపీ, యూరియా సరఫరా చేయాలి

పప్పుధాన్యాలు, నూనెగింజల కొనుగోలుపై 25 శాతం పరిమితి ఎత్తివేయాలి

కేంద్ర మంత్రులకు రాష్ట్ర మంత్రులు తుమ్మల, ఉత్తమ్ విజ్ఞప్తి 

హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం మంగళవారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను  రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులు, రైతాంగ ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించారు.

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణ, రైతుల ప్రయోజనాల పరిరక్షణ, దేశీయ వంటనూనెల ఉత్పత్తి పెంపుపై విస్తృతంగా చర్చించారు. ఆయిల్‌పామ్ ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని వివరించారు. ఇప్పటికే సుమారు 3 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరించగా, 70 వేల మందికిపైగా రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారని, రాబోయే మూడేళ్లలో ఈ విస్తీర్ణాన్ని 10 లక్షల ఎకరాలకు పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

పామాయిల్ దిగుమంతి సుంకాన్ని 44 శాతం నుంచి 16 శాతానికి తగ్గించడం వల్ల దేశీయ ఆయిల్ పామ్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఆ తర్వాత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసి తెలంగాణ రైతాంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో డీఏపీ, యూరియా ఎరువుల అవసరం పెరిగిందని, కేంద్రం కేటాయించిన కోటాకు, వాస్తవ సరఫరాకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వెంటనే పూడ్చి, రాష్ట్రానికి పూర్తి స్థాయిలో ఎరువులు అందించాలని కోరారు.

పప్పుధాన్యాలు, నూనెగింజల కొనుగోళ్లపై ప్రస్తుతం అమలులో ఉన్న 25 శాతం పరిమితి రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నదని, రైతులు ఉత్పత్తి చేసిన మొత్తం పంటను కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కోరారు. తెలంగాణలో ఎరువుల సరఫరా, పోషకాధారిత ఎరువుల సబ్సిడీ విధానంలో మార్పులకు సంబంధించి అంశాలను కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు వివరించారు. మంత్రుల వెంట ఎంపీలు రఘువీర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఉన్నారు.