17-07-2025 01:48:59 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 16 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ఓ భూవి వాదంలో ఏపీ క్యాడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్పీసింగ్‌ను సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖజాగూడలోని అత్యంత విలువైన స్థలానికి సంబంధించి, ఓ ప్రముఖ నిర్మాణ సంస్థను మోసం చేశారన్న ఫిర్యాదు మేరకు బుధవారం అతడి నివాసంలో అదుపులోకి తీసుకొని, విచారణ నిమిత్తం సీసీఎస్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఖాజాగూడలోని సర్వే నంబర్ 19లో ఉన్న 10 ఎకరాల 32 గుంటల భూమి తమదేనని ఆర్పీ సింగ్, ఆయన భార్య హర్విందర్ సింగ్ చెబుతున్నారు. ఈ స్థలంలో ఒక భారీ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం వారు ఐ-టవర్ అనే నిర్మాణ సంస్థతో డెవలప్‌మెంట్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం ప్రకారం నిర్మాణం ప్రారంభించిన ఐ-టవర్ సంస్థ, ప్రాజెక్టు కోసం బ్యాంక్ లోన్‌కు దరఖాస్తు చేసింది.
ఈ క్రమంలో బ్యాంక్ అధికారుల పరిశీలనలో విషయం బయటపడింది. ఒప్పందం చేసుకున్న మొత్తం స్థలంలో 3 ఎకరాల 24 గుంటల భూమి ఆర్పీ సింగ్ కుమార్తె పేరిట గిఫ్ట్ డీడ్‌గా ఉన్నట్టు తేలింది. ఈ విషయాన్ని ఐ-టవర్ యాజమాన్యం వెంటనే ఆర్పీ సింగ్ దృష్టికి తీసుకెళ్లగా, తమ కుమార్తె అమెరికాలో ఉందని, గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేస్తామని వారు చెప్పినట్టు సమాచారం.
అయితే, ఇంత కీలకమైన విషయాన్ని ఒప్పందం సమయంలో దాచిపెట్టి, తమను మోసం చేశారని ఆరోపిస్తూ ఐ-టవర్ యాజమాన్యం రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కేసు తీవ్రత దృష్ట్యా, దర్యాప్తును సీసీఎస్ పోలీసులకు బదిలీ చేశారు.
బాధితుల ఆందోళన..
ఈ వివాదం కారణంగా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో ప్లాట్లను కొనుగోలు చేసిన దాదాపు 700 మంది కస్టమర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నిర్మాణం పూర్తి కాకపోవడం, బ్యాంకు లోన్లు కూడా రాకపోవడంతో తాము నష్టపోయామని వాపోతున్నారు.
ఈ నేపథ్యంలోనే సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగి ఆర్పీ సింగ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది.