26-07-2024 06:39:12 PM
హైదరాబాద్: పంచాయతీరాజ్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మంత్రి దామోదర రాజనర్సింహ. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, మాజీమంత్రి జానారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి,ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ధరణి కమిటీ సభ్యులు కోదండ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభారణం కృష్ణ మోహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పంచాయితీ ఎన్నికల కార్యాచరణపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. త్వరలోనే పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేస్తామని, ఆగస్టు నెల చివరి వరకు ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే సర్పంచుల పదవీకాలం ముగిసిన ఆరు నెలలు గడుస్తున్నందున రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకుండా గత రిజర్వేషన్లనే కొనసాగించాలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి వారం రోజుల క్రితం అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.