calender_icon.png 22 November, 2025 | 1:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవ్ పార్టీ నిందితులకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కౌన్సెలింగ్

26-07-2024 09:14:33 PM

హైదరాబాద్: రేవ్ పార్టీ వంటి కార్యక్రమాల్లో పాల్గొని తమ బంగారు భవిష్యత్తును బలి చేసుకోవద్దని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి అన్నారు. కళాశాలల్లో ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు రేవ్ పార్టీల్లో మద్యం, డ్రగ్స్, ఇతర కార్యకలాపాలకు పాల్పడుతుంటే సభ్య సమాజం ఎటు పోతుందని, భావితరాల భవిష్యత్తు ఏమైపోతుందనే భయం వేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మాదాపూర్‌లో క్లౌడ్ అపార్ట్‌మెంట్‌లో నిర్వహించిన రేవ్ పార్టీలో 20 మందికి పైగా పట్టుబడిన విషయం తెలిసిందే.

ఐదుగురిపై కేసు నమోదు చేసి వారిని జైలుకు పంపించిన అధికారులు మిగిలిన యువతి,యువకుల భవిష్యత్తును సరిదిద్దే క్రమంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ సమక్షంలో అబ్కారీ భవన్‌లో కౌన్సిలింగ్ నిర్వహించారు. రేవ్ పార్టీలో పట్టుబడిన వారిలో ఎనిమిది మంది యువతి, యువకుల కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎంతో భవిష్యత్తు ఉన్న మీరు కొద్దిపాటి సంతోషం కోసం మీ జీవితాలను బలి చేసుకుంటూ ఆడ, మగ తేడా లేకుండా గంజాయి, డ్రగ్స్, మద్యం సేవించడం, గోవాకు, పబ్బులకు, రేవ్‌పార్టీలకు వెళ్లడం లాంటి వాటికి పాల్పడడం ద్వారా ఏమి సాధించాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు.

ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల్లో భర్తలు, కూతుళ్లు, కుమారులు పాల్గొంటుంటే తల్లిదండ్రులుగా, కట్టుకున్న భార్యలుగా మీరు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. మీరు మారతారని ఒక అవకాశం ఇవ్వాలని భావించిన క్రమంలో మిమ్ములను కౌన్సిలింగ్‌కు పిలిచామని, లేదంటే అరెస్ట్ చేసి, జైలుకు తరలించాల్సి ఉండేదని హెచ్చరించారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి , ఈఎస్‌ఎస్‌టీఎఫ్ టీమ్ లీడర్ ప్రదీప్‌రావు, సిబ్బంది సమక్షంలో జరిగిన కౌన్సిలింగ్‌లో రేవ్ పార్టీ బాధితులు, వారి కుటుంబసభ్యులు హాజరయ్యారు.