07-05-2025 12:00:00 AM
మాజీమంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
సూర్యాపేట, మే 6 (విజయక్రాంతి): తెలంగాణ ఖజానా దివాలా తీసింది అంటూ రాష్ర్ట ప్రతిష్టను దిగజారుస్తున్న ఘనుడు సీఎం రేవంత్ రెడ్డి అని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఆయన విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిపాలన చేసే దమ్ములేక దివాళాకోరు మాటలు మాట్లాడడం సరికాదన్నారు.
తెలంగాణ రాష్ర్టంగా అప్పులతోనే మొదలైంది. అయినా పదేండ్లు కెసిఆర్ చేసిన అభివృద్ధి పాలన చూసి కూడా ఇలా మాట్లాడడం దారుణం అన్నారు. రాష్ర్ట ఆర్థిక పరిస్థితిని పట్టే కెసిఆర్ హామీలిచ్చి పదేళ్లలో యావత్ దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దిండన్నారు. కానీ రేవంత్ అడ్డగోలు హామీలిచ్చి అమలు చేతకాక ఇప్పుడు చేతులెత్తేస్తుండన్నారు.
మొదటి నుండి బీఆర్‌ఎస్ చెప్తున్న మాటలు నేడు నిజమని తెలిపోయాయన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి తన విధానాలను సరిచేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, నాయకులు పుల్లెంల వెంకట్ నారాయణ గౌడ్, మారిపెద్ది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.