calender_icon.png 31 July, 2025 | 6:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవసాయ రంగంలో ఇక్రిసాట్ తో విప్లవాత్మక మార్పులు

30-07-2025 10:49:57 PM

నూతన సాంకేతికతో అద్భుతమైన వంగడాల సృష్టి..

ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్..

ఇక్రిసాట్ తో ఎంఓయు కుదుర్చుకున్న కావేరి విత్తన విశ్వవిద్యాలయం..

గజ్వేల్: వ్యవసాయ రంగంలో ఇక్రిసాట్ వల్ల దేశంలో విప్లవాత్మక మార్పులు వచ్చినట్లు ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్(Director General Dr. Himanshu Pathak) అన్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం సమీపంలోని కావేరి యూనివర్సిటీ, విత్తన సంస్థ, పరిశోధన కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించి వివిధ విభాగాలను పరిశీలించారు. నూతన సాంకేతికతతో అద్భుత వంగడాలను సృష్టించి వ్యవసాయ రంగంలో చరిత్ర సృష్టించాలని పేర్కొన్నారు. ఇక్రిసాట్ లోని వివిధ రంగాల సాంకేతికత అందిపుచ్చుకునేందుకు కావేరి యూనివర్సిటీ, విత్తన, పరిశోధన కేంద్రం ముందుకు రావడంతో ఎంఓయూ కుదుర్చుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో దేశ పునర్నిర్మాణానికి కావేరి విశ్వవిద్యాలయ విద్యార్థులు ముందుకు రావాలని ఆకాంక్షించారు. నూతన వ్యవసాయ పరిశోధనలతో ప్రపంచానికి సరిపడా ఆహార సంపదను సృష్టించి ఎగుమతి చేసే సత్తా దేశంలోని వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశోధన విద్యార్థులకు ఉండగా, ఇప్పటినుండే లక్ష్యసాధనలో ముందుండాలన్నారు.

ఇక్రిసాట్ తో ఒప్పందం కుదుర్చుకోవడంతో కావేరి విద్యార్థులు తమ శాస్త్రవేత్తలతో నేరుగా పరిశోధనలో పాల్గొనే అవకాశం దక్కిందని చెప్పారు.  కావేరి యూనివర్సిటీ దేశంలోనే మొట్ట మొదటి అగ్రిటెక్ యూనివర్సిటీ కాగా, విద్య, మరియు పరిశోధనలను నేరుగా వ్యవసాయ క్షేత్రం, రీసెర్చ్ సెంటర్ లోనే కొనసాగించవచ్చని స్పష్టం చేశారు. వ్యవసాయ పరిశ్రమలు కలిగి ఉన్న కావేరి యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటిదిగా ప్రసిద్ధికెక్కినట్లు చాన్సలర్ భాస్కరరావు, వైస్ చాన్సలర్ ప్రవీణ్ రావు, వైస్ చైర్మన్ పవన్ రావులు పేర్కొన్నారు. తమ సంస్థలో విద్యనభ్యసించిన విద్యార్థులను చక్కటి వ్యవసాయ శాస్త్రవేత్తలుగా  తీర్చిదిద్దడమే తమ ముందున్న ఏకైక లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్టార్ డాక్టర్ శ్రీనివాసులు, స్టూడెంట్ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ హర్షరావు, అగ్రికల్చర్ డీన్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి, డీన్ ఆఫ్ టెక్నాలజీ డాక్టర్ కొండా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.