calender_icon.png 24 July, 2025 | 1:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం అందించాలి

23-07-2025 05:45:42 PM

విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి.. 

కరీంనగర్ (విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం అందించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి(District Collector Pamela Satpathy) పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు, పురోగతి, బాధితులకు చెల్లించాల్సిన పరిహారం తదితర అంశాలపై జిల్లాస్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జరిగింది. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో నమోదైన అట్రాసిటీ కేసులు, పరిష్కరించిన కేసులు, బాధితులకు అందిన పరిహారం గురించి కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో కేసు పూర్వాపరాలను పరిశీలించి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగే విధంగా అధికారులు చర్య తీసుకోవాలని అన్నారు. ఎస్సీ ఎస్టీ హాస్టళ్లను సందర్శిస్తున్నామని, హాస్టల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ పరిధిలోని దుకాణాలను అసలైన లబ్ధిదారులకు అందించామని అన్నారు. ఈ సందర్భంగా మానిటరింగ్ కమిటీ సభ్యులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. భగత్ నగర్లో కేటాయించిన కమ్యూనిటీ భవన నిర్మాణ స్థలానికి ప్రహరీ గోడ నిర్మించాలని సభ్యులు కోరారు. ఇందిరమ్మ ఇండ్లలో ప్రాధాన్యత ఇవ్వాలని, కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని, కులాంతర వివాహాలకు ప్రోత్సాహకం, నిరుద్యోగ యువతకు శిక్షణ, ఉపాధి పొందేందుకు రుణాలు ఇవ్వాలని సభ్యులకు కోరారు.

ఈ అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ తెలిపారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ... అట్రాసిటీ కేసుల విషయంలో త్వరిత గతిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎఫ్ఐఆర్, చార్జిషీట్, పరిష్కారం అయిన కేసులు, విచారణలో ఉన్న కేసులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, ఆర్డీవో మహేశ్వర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆరెల్లి రాములు, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ అనిల్ ప్రకాష్, ఏసిపిలు వెంకటస్వామి, శ్రీనివాస్, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మేడి మహేష్, తడగొండ నర్సింబాబు, ఎలుక ఆంజనేయులు పాల్గొన్నారు.